నితీశ్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ సంగీతంపై వస్తున్న మిశ్రమ స్పందనలపై ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫీడ్‌బ్యాక్‌ల కంటే తన పనిలో చూపించే నిజాయతీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ "ఒక పాటను సిద్ధం చేసే క్రమంలో ఎంతో శ్రమిస్తాం. అనేక మార్పులు, చేర్పులు, ఆలోచనల తర్వాతే దాన్ని ఫైనల్ చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఫీడ్‌బ్యాక్‌లు చూసే ఓపిక కూడా ఉండదు. నా కొడుకు అప్పుడప్పుడు.. 'నిన్న ఇలా అన్నారు, ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు' అని చూపిస్తుంటాడు. నేను నా పనిని నిజాయతీగా పూర్తి చేశాను, ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను" అని రెహమాన్ తెలిపారు.

ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాటను అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. అయితే ఈ పాట ఖవ్వాలీ లేదా సూఫీ శైలిలో ఉందని, ఇది రామాయణ ఇతిహాస నేపథ్యానికి సరిపోదని కొందరు ఆన్‌లైన్‌లో విమర్శిస్తున్నారు. గతంలో వచ్చిన ‘రావణ తాండవ్’ పాటకు కూడా మొదట ఇలాంటి విమర్శలే ఎదురైనా, తర్వాత ప్రశంసలు దక్కాయి.

మూడు దశాబ్దాల తన కెరీర్‌లో, ఇలాంటి గొప్ప కథకు బహుళ భాషల్లో సంగీతం అందించడం ఒక గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు రెహమాన్ పేర్కొన్నారు. ఈ సినిమాకు గ్లోబల్ అప్పీల్ తీసుకురావడానికి, ప్రముఖ హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. నవంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.