బుల్లెట్‌ చేతిలో ఉంది.. పెదాల మధ్య గులాబీ ఉంది.. చూపుల్లో మాత్రం కసి కనిపిస్తోంది! బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన కొత్త సినిమా ‘కింగ్‌’ పోస్టర్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ‘ఖతీల్‌ నహీ.. ఆశిక్‌ హూన్‌’ (హంతకుడిని కాదు.. ప్రేమికుడిని) అంటూ ఆసక్తికరమైన డైలాగ్‌ను జోడించాడు. ఈ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలను మరింత పెంచాడు. ఈ సినిమా 2026 డిసెంబర్‌ 24న థియేటర్లలోకి రానుంది.

షారుక్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టర్‌ను పంచుకున్నాడు. అందులో అతడు నోట్లో గులాబీ పువ్వు పెట్టుకుని, చేతిలో తుపాకీ పట్టుకుని కనిపించాడు. ఆయన చూపుల్లోని తీవ్రత పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. ‘మళ్లీ గుర్తొచ్చింది.. హంతకుడిని కాదు, ప్రేమికుడిని’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చాడు.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్‌’ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రంలో షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. తండ్రీకూతుళ్లు తొలిసారి కలిసి తెరపై కనిపించనుండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అభిషేక్‌ బచ్చన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, రాణి ముఖర్జీ, జైదీప్‌ అహ్లావత్‌, జాకీ ష్రాఫ్‌, రాఘవ్‌ జుయల్‌, అభయ్‌ వర్మ కూడా ఇందులో నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా కథ, ఇతర వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.

సుహానా ఖాన్‌ 2023లో ‘ది ఆర్చీస్‌’తో నటిగా పరిచయమైంది. షారుక్‌ చివరిగా ‘డంకీ’ సినిమాలో కనిపించాడు. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2023లో విడుదలైంది.