బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహుజా మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. గోవిందా తన సహనటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో సన్నిహితంగా ఉండడంపై సునీత తీవ్ర ఆరోపణలు చేయడంతో వారి బంధం వార్తల్లో నిలిచింది. నెలలుగా సాగుతున్న ఈ ప్రచారంపై గోవిందా ఎట్టకేలకు మౌనం వీడారు. తన భార్యను ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇద్దరి మధ్య ఓ పెద్ద గేమ్ ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏబీపీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా ఈ అంశంపై స్పందించారు. "ప్రస్తుతం ప్రజలు ఏమంటున్నారనే దానిపై నేను దృష్టి పెట్టడం లేదు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహిళలు ఇలాగే స్పందిస్తున్నారు. నేను మహిళల స్పందనను ఎప్పుడూ వ్యతిరేకించను. నేను మౌనంగా, గౌరవంగా ఉంటాను. ఎందుకంటే ఈ దశ ముగిశాక కూడా గాయాలు మిగిలిపోకూడదని నేను కోరుకుంటున్నాను" అని తెలిపారు.

"ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఏడెనిమిదేళ్ల క్రితమే ఊహించాను. ఇప్పుడు మేమంతా ఆ వలయంలోనే చిక్కుకున్నాం. నా పేరుతో చెడ్డపేరు ఎప్పుడూ ముడిపడి ఉంటుంది. నా భార్యను ఎవరో ప్రభావితం చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సమయం వస్తుంది. సన్నిహితులు సైతం ఇతరుల మాటలకు ప్రభావితమవుతారు" అని గోవిందా ఆవేదన వ్యక్తం చేశారు. 

తన భార్య సునీత వల్లే తాను జీవితంలో, కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నానని ఆయన స్పష్టం చేశారు. "నా తల్లి ఆశీస్సులు, నా భార్య అదృష్టం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆమె వల్లే నేను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి ఆమె పరువుకు నేను ఎప్పటికీ భంగం కలిగించను" అని అన్నారు.

తన భార్యను రెచ్చగొడుతున్న వారు అలసిపోయి వదిలేసే వరకు తాను ఆమె ఆరోపణలను మౌనంగా భరిస్తానని గోవిందా తెలిపారు. "వాళ్లు అలసిపోయి, గోవిందాతో తప్పుగా పెట్టుకున్నామని గ్రహించే వరకు నేను ఇలాగే ఉంటాను. ఈ దశ దాటిపోయాక, నేను ఎంత గౌరవంగా ప్రవర్తించానో అందరికీ అర్థమవుతుంది. నేను వాళ్ల ఉచ్చులో పడను" అని ఆయన వ్యాఖ్యానించారు. నటి కోమల్ రాణితో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను గోవిందా ఇప్పటికే ఖండించారు.