విజయ్‌ దేవరకొండను పెళ్లి చేసుకోవాలని వందసార్లు అడిగానన్న వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు నటి రష్మిక మందన్న గట్టిగా బదులిచ్చింది. తన ప్రేమ, పెళ్లి గురించి ఇతరులు తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు తనకు ఉందని, విజయ్‌ను మళ్లీ మళ్లీ ఎంచుకుంటూనే ఉంటానని చెప్పింది. ‘వెయ్యిసార్లైనా ఇదే నిర్ణయం తీసుకుంటా.. వందసార్లు అనేది పెద్ద విషయమే కాదు’ అంటూ ట్రోలర్లకు సమాధానమిచ్చింది. 

ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌-9’ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో రష్మిక, విజయ్‌ తమ పెళ్లి గురించి మాట్లాడారు. తాను పెళ్లి చేసుకుందామని విజయ్‌ను ఏడాది పాటు అడిగానని రష్మిక చెప్పింది. దాదాపు వందసార్లు అడిగిన తర్వాతే విజయ్‌ అంగీకరించాడన్న విషయం చర్చకు దారితీసింది. విజయ్‌ ఆమెను అవమానించాడంటూ కొందరు సోషల్‌ మీడియాలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రష్మిక తన సోషల్‌ మీడియా పోస్ట్‌తో స్పందించింది. 

తమ మధ్య ప్రేమ అనేది పెళ్లి ప్రపోజల్‌, ఉంగరం తొడగడం వంటి విషయాలకే పరిమితం కాదని రష్మిక తెలిపింది. జీవితాన్ని కలిసి నిర్మించుకోవడమే అసలైన విషయమని పేర్కొంది. తాను భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తినని, విజయ్‌ మాత్రం అన్ని కోణాల్లో ఆలోచిస్తాడని చెప్పింది. ఈ భిన్నత్వమే తమ బంధానికి బలమని వివరించింది.

కష్టాల్లోనూ అతడే తోడుగా ఉన్నాడు
తనకు కష్టాలు ఎదురైనప్పుడు విజయ్‌ అండగా నిలిచాడని రష్మిక చెప్పింది. ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా, ఆందోళనతో నిద్రలేచినా తన పక్కన అతడే ఉన్నాడని తెలిపింది. కొన్నేళ్ల క్రితం తాను కష్టకాలాన్ని ఎదుర్కొన్నప్పుడు విమర్శలు చేస్తున్నవారు తనకు తోడుగా లేరని, విజయ్‌ మాత్రం అండగా నిలిచాడని పేర్కొంది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని చెప్పింది.

తన కుటుంబం గురించి తెలియకుండా వ్యాఖ్యలు చేయడాన్ని రష్మిక తప్పుబట్టింది. తనను ఎంతైనా విమర్శించవచ్చని, కానీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం సరికాదని స్పష్టం చేసింది. స్త్రీవాదం అంటే ఇతరులను కించపరచడం కాదని, తమ జీవితాలను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉండటమని పేర్కొంది. తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవిస్తున్నామని, విజయ్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉన్నానని తెలిపింది.