ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుత పెట్టుబడుల వాతావరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 'ఏఐ'లో కనిపిస్తున్నది బూమ్ కాదని, అదొక "బబుల్" (బుడగ) అని అభివర్ణించారు. ఈ కారణంగా, తమ సంస్థ భారీ మౌలిక సదుపాయాలపై ఇప్పుడే పెట్టుబడులు పెట్టబోదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ చమత్ పాలిహపిటియ 'ఎక్స్'లో చేసిన ఒక పోస్టుకు శ్రీధర్ వెంబు బదులిచ్చారు. ఏఐ కంపెనీల ఆదాయ నాణ్యతను చామత్ తన పోస్టులో ప్రశ్నించారు. ప్రస్తుతం ఏఐపై ఖర్చు చేస్తున్న వాటిలో అధిక శాతం నష్టాల్లో ఉన్న, వెంచర్ క్యాపిటల్ నిధులతో నడిచే కొన్ని కంపెనీలేనని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో వెంబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"సాధారణంగా మేం ఇతరుల డబ్బుతో భారీ వ్యాపారాలు చేసే పద్ధతికి దూరంగా ఉంటాం. ఏఐలో మౌలిక పరిశోధన, అభివృద్ధి (ఆర్&డి) కోసం మేం పెట్టుబడులు పెడుతున్నాం. అయితే, డేటా సెంటర్లు, ప్రత్యేక హార్డ్‌వేర్ వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడానికి ఈ బుడగలాంటి వాతావరణం తగ్గేంత వరకు వేచి చూస్తాం" అని శ్రీధర్ వెంబు తన పోస్టులో పేర్కొన్నారు.

శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు ఏఐ విషయంలో జోహో భవిష్యత్ వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు స్థిరపడే వరకు భారీ ఖర్చులు చేయకుండా, ఏఐ పరిశోధన సామర్థ్యాలను పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తామని ఆయన పరోక్షంగా సూచించారు. ఏఐ రంగంలోకి వెల్లువెత్తుతున్న భారీ పెట్టుబడులు స్థిరమైన రాబడిని ఇస్తాయా లేదా అనే అంశంపై టెక్ పరిశ్రమలో విస్తృతంగా జరుగుతున్న చర్చకు వెంబు వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.