కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి కోర్టులో ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు పరువునష్టం కలిగించేలా లేవని కోర్టు స్పష్టం చేసింది. సోమవారం తీర్పు వెలువడిన సమయంలో రాహుల్‌ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో జరిగిన సభలో అమిత్‌ షాపై రాహుల్‌ గాంధీ  విమర్శలు చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిపై హత్య కేసు ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమిత్‌ షా ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్‌ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4న సుల్తాన్‌పుర్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్‌పై క్రిమినల్‌ పరువునష్టం కేసు నమోదైంది. 

ఐదేళ్లకు పైగా సాగిన న్యాయపోరాటం
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని 2023లో కోర్టు రాహుల్‌ను ఆదేశించింది. అనంతరం ఆయన కోర్టుకు హాజరై బెయిల్‌ పొందారు. రాహుల్‌ ప్రసంగానికి సంబంధించిన వాయిస్‌ నమూనాను పోల్చాలని ఫిర్యాదుదారు కోరినా, దిగువ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చేసిన పిటిషన్లను కూడా పైకోర్టులు కొట్టివేశాయి. తాజాగా తుది తీర్పు వెలువరిస్తూ రాహుల్‌ వ్యాఖ్యలు పరువునష్టం పరిధిలోకి రావని కోర్టు పేర్కొంది.