కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యను లక్ష్యంగా చేసుకుని సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ వీడియోలో బాధితురాలిగా కనిపించిన మహిళ పోలీసుల ఎదుట హాజరై కీలక వాంగ్మూలం ఇచ్చారు. సిద్దరామయ్య తనను ఎలాంటి లైంగిక వేధింపులకు గురిచేయలేదని, ఆయన వల్ల తనకు ఎటువంటి హాని జరగలేదని ఆమె స్పష్టం చేశారు.

తాను సిద్దరామయ్యను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని ఆ మహిళ పోలీసులకు తెలిపారు. కొందరు వ్యక్తులు చెప్పిన సూచనల మేరకే తాను వీడియోలో మాట్లాడానని, అంతకుమించి తనకు ఏమీ తెలియదని వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి ఫిర్యాదు చేయబోనని, చట్టపరమైన చర్యలు తీసుకోబోనని కూడా ఆమె తేల్చిచెప్పారు.

గత నెలలో సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఆరోపణలతో కూడిన రెండు వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ కావడంతో ఈ వివాదం మొదలైంది. తన ప్రతిష్టకు భంగం కలిగించి, బ్లాక్ మెయిల్ చేసేందుకే ఈ నకిలీ వీడియోను సృష్టించారని ఆరోపిస్తూ సిద్దరామయ్య అక్టోబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ కేసులో భాగంగా, వీడియోను అప్‌లోడ్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన రితేశ్ పాండే అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. మహిళ వాంగ్మూలంతో ఇప్పుడు ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.