ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి ఓ హత్య కేసు నిందితుడు ఆడిన నాటకం పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. తన మరణాన్ని తానే సృష్టించుకుని, కోర్టును సైతం బురిడీ కొట్టించి దాదాపు ఏడాదిన్నర పాటు సన్యాసి వేషంలో తప్పించుకు తిరిగిన నిందితుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మౌ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ రాజ్‌భర్ అలియాస్ రాజు (38)ను ఆదివారం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ), కోత్వాలి నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.

2016లో జరిగిన యోగేష్ సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో రాజ్‌కుమార్ నిందితుడిగా ఉన్నాడు. విచారణ ఎదుర్కొంటూనే బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, కేసు నుంచి శాశ్వతంగా తప్పించుకునేందుకు 2025 మే నెలలో ఒక విచిత్రమైన కుట్ర పన్నాడు. ఘాజీపూర్‌లో ఒక మేకను చంపి, దానిని చితిపై ఉంచి దహనం చేశాడు. ఆ సమయంలో ఏఐ టెక్నాలజీ సాయంతో చితిపై ఉన్న మేక శరీరం స్థానంలో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఫొటోలు సృష్టించాడు.

చివరకు అంత్యక్రియల ఊరేగింపు, అంతిమ సంస్కారాల ఫొటోలను ఆధారాలుగా చూపి మౌ మున్సిపల్ కౌన్సిల్ నుంచి అధికారికంగా మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్) కూడా సంపాదించాడు. కుటుంబసభ్యులు 13వ రోజు తిథి (తెరహ్వీ) కార్యక్రమం కూడా జరిపించారు. ఆ పత్రాలను కోర్టులో సమర్పించి నిందితుడు చనిపోయినట్లు నమోదు చేయించి కేసు నుంచి తప్పించుకున్నాడు.

చనిపోయినట్లు నమ్మించిన అనంతరం నిందితుడు సన్యాసి అవతారం ఎత్తి వివిధ నగరాల్లో తిరిగాడు. హత్య కేసు నుంచే కాకుండా, స్టాక్ మార్కెట్ ట్రేడర్‌గా నమ్మిస్తూ పలువురి వద్ద పెట్టుబడుల పేరిట సేకరించిన భారీ మొత్తాన్ని ఎగవేసేందుకే ఈ దారుణ నాటకానికి తెరతీశాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనూప్ కుమార్ తెలిపారు.

ఖ్వాజాజహాన్‌పూర్ ప్రాంతంలో నిందితుడు తిరుగుతున్నట్లు అందిన నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోర్జరీ, కోర్టును పక్కదారి పట్టించడం వంటి తీవ్రమైన కొత్త కేసులు నమోదు చేసి, పాత హత్య కేసు విచారణను పునఃప్రారంభించారు.