ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కొత్త మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ ‘బేయాన్‌’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. దీంతో క్రెటా తర్వాత ఈ విభాగంలో కంపెనీకి ఇది రెండో ఎస్‌యూవీగా నిలిచింది. బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.11,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా హ్యుందాయ్‌ డీలర్‌షిప్‌ల వద్ద బుక్‌ చేసుకోవచ్చు.

డ్యూయల్‌ స్క్రీన్లు.. జనరేటివ్‌ ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌
బేయాన్‌లో 12.3 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మరో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ ఇచ్చారు. ఇందులో హ్యుందాయ్‌ తొలిసారిగా జనరేటివ్‌ ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ను అందించింది. ప్రయాణ ప్రణాళికలు, వాతావరణం, హోటళ్లు, రెస్టారెంట్లు, సమీపంలోని పర్యాటక ప్రాంతాల గురించి వాయిస్‌ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. పెర్‌ప్లెక్సిటీ ఇంటెలిజెన్స్‌, సౌండ్‌హౌండ్‌ ఏఐ సాంకేతికతలను ఇందులో ఉపయోగించారు.

పెట్రోల్‌ ఇంజిన్‌.. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ఆప్షన్లు
ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్‌ నాలుగు సిలిండర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 115 పీఎస్‌ పవర్‌, 144 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో పాటు ఐవీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలు ఉన్నాయి. ఆటోమేటిక్‌ వేరియంట్‌ లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. సిఎన్‌జీ వేరియంట్‌ను 2027 జనవరిలో తీసుకురానున్నట్లు సమాచారం.

భద్రతకు ప్రాధాన్యం
బేయాన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. లెవల్‌-2 ప్రో ఏడీఏఎస్‌ వ్యవస్థలో భాగంగా లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌, బ్లైండ్‌ స్పాట్‌ కొలిజన్‌ వార్నింగ్‌, స్మార్ట్‌ క్రూజ్‌ కంట్రోల్‌ వంటి డ్రైవర్‌ సహాయక ఫీచర్లు అందించారు. మొత్తంగా 80కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయని హ్యుందాయ్‌ పేర్కొంది.