ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై నెలకొన్న అడ్డంకులు తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం 148 మీటర్లకే పరిమితం చేస్తే ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను, అదే ఎత్తును 152 మీటర్లకు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను ఫడ్నవీస్‌కు రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించవచ్చని, తద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని ఆయన తెలిపారు.

బ్యారేజీ ఎత్తు పెంచితే మహారాష్ట్రలో ముంపు ఏ మేరకు ఉంటుంది, నీటి నిల్వ సామర్థ్యం వంటి సాంకేతిక అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఒప్పందాన్ని పునఃసమీక్షించి, బ్యారేజీ ఎత్తు పెంపునకు అంగీకరించాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రను కోరింది.