రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. కానీ, ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థిని, గ్రామస్థులందరూ కలిసి ఏకంగా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చి సత్కరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక బంధాలకు, ఐక్యతకు ఈ సంఘటన నిలువుటద్దం పడుతోంది.

వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లా ముండ్వా పంచాయతీ సమితి పరిధిలోని భదౌరా గ్రామ పంచాయతీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి చిడి దేవి అనే మహిళ పోటీ చేశారు. ఆమె ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. హోరాహోరీగా సాగిన పోరులో చిడి దేవి కేవలం 162 ఓట్ల స్వల్ప తేడాతో తన ప్రత్యర్థి గిరిజా సంధు చేతిలో ఓటమి పాలయ్యారు. చిడి దేవికి 1,155 ఓట్లు రాగా, గిరిజా సంధుకు 1,317 ఓట్లు వచ్చాయి.

ఈ ఫలితంతో చిడి దేవి, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, గ్రామ ప్రజలు వినూత్నంగా స్పందించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ నిర్వహించి, "గెలిస్తే ఊరంతా గెలిచినట్టే, ఓడినా ఊరంతా ఓడినట్టే" అని ఏకతాటిపై నిలిచారు. గెలుపోటముల కన్నా గ్రామ ఐక్యత, సోదరభావమే శాశ్వతమని చాటిచెప్పారు. వెంటనే గ్రామస్థులందరూ కలిసి రూ.25 లక్షలు పోగుచేశారు.

ఆ డబ్బును ఒక పళ్లెంలో ఉంచి, మేళతాళాలతో చిడి దేవి ఇంటికి ఊరేగింపుగా వెళ్లారు. ఆమె ఓటమిని ఒక గౌరవప్రదమైన వేడుకగా మార్చారు. ఈ అపూర్వ గౌరవంతో చిడి దేవి, ఆమె భర్త హేమారామ్ రావు భావోద్వేగానికి గురయ్యారు. గ్రామస్థులు ఇంతలా స్పందించడానికి బలమైన కారణం ఉంది. 

హేమారామ్ రావు గతంలో తన సొంత డబ్బుతో గ్రామ గోశాలకు కొత్త ట్రాక్టర్ విరాళంగా ఇచ్చారు. అలాగే, గ్రామస్థుల దాహార్తి తీర్చడానికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆయన సేవా గుణాన్ని, సామాజిక స్పృహను గ్రామస్థులు ఈ రూపంలో గౌరవించారు.

"ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడ్డాం. కానీ గ్రామస్థులు చూపిన ప్రేమ, ఆదరణ చూశాక ఆ బాధ గర్వపడాల్సిన అంశంగా మారింది. పదవి కన్నా ప్రజల అభిమానమే గొప్పది" అని హేమారామ్ రావు అన్నారు. రాజకీయ పోటీలు గ్రామాల్లో ఐక్యతను దెబ్బతీయలేవని, మానవ సంబంధాలే ముఖ్యమని ఈ సంఘటన నిరూపించింది.