ప్రముఖ తమిళ నటుడు ధనుశ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ఊహాగానాలకు మరోసారి బలం చేకూరింది. తన మహిళా అభిమానులకు దీపావళి కానుకగా ఆయన ఇచ్చిన వెండి దీపాలపై కమలం గుర్తు ఉండటం తమిళనాట రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ ఎన్నికల గుర్తు కూడా కమలం కావడంతో ఈ పరిణామం కొత్త సమీకరణాలకు సంకేతమా అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఆదివారం నటుడు ధనుశ్‌ తన అభిమాన సంఘం "ధనుశ్‌ నర్పణి ఇయక్కం" మహిళా విభాగం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,000 మంది మహిళా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ దీపావళి కానుకగా వెండి ప్రమిదలను బహూకరించారు. అయితే, ఆ దీపాలపై కమలం పువ్వు ముద్ర ఉండటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పలువురు రాజకీయ నేతలు కూడా దీనిపై స్పందించడంతో ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వివాదంపై ధనుశ్‌ నర్పణి ఇయక్కం ప్రతినిధి ఒకరు స్పష్టతనిచ్చారు. దీపంపై ఉన్న కమలం గుర్తు కేవలం దానిని తయారు చేసిన సంస్థకు సంబంధించిన స్టాంప్ మాత్రమేనని, దీనికి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరించారు. అయినప్పటికీ, ఈ వివరణతో ఊహాగానాలు ఆగలేదు. 

ఇటీవల ధనుశ్‌ తన ఫ్యాన్ క్లబ్‌ను ఒక సేవా ఉద్యమంగా పునర్‌వ్యవస్థీకరించారు. దీనికి తోడు ఆయన 'తమిళగ ఎళుచ్చి కజగం' పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామం ఈ వదంతులకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

ఈ రాజకీయ ఊహాగానాలపై మీడియా ప్రతినిధులు ధనుశ్‌ను ప్రశ్నించగా, ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపి, "చాలా సంతోషంగా ఉంది" అని మాత్రమే చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజకీయ ప్రవేశంపై ఆయన మౌనం పాటించడం ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది.