సొంత మామ ఇంట్లోనే చేతివాటం ప్రదర్శించి, ఆ సొమ్ముతో ఖరీదైన కారు కొని, దాని ప్రారంభోత్సవానికి మళ్లీ ఆ మామనే ఆహ్వానించి అడ్డంగా దొరికిపోయాడో 19 ఏళ్ల యువకుడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన ఈ వింత ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.

కొల్హాపూర్‌కు చెందిన సమర్ చవాన్ (19) అనే యువకుడు, తన మామ ఉమేశ్ మారుతి చవాన్ ఇంట్లో నుంచి సుమారు 150 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వాటిని ఓ స్వర్ణకారుడికి విక్రయించి, వచ్చిన రూ.10 లక్షలతో తన కలల వాహనమైన మహీంద్రా థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అంతటితో ఆగకుండా, కొత్త కారుకు పూజ చేయాలని నిర్ణయించుకుని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన మామ ఉమేశ్‌నే ఆహ్వానించాడు.

మేనల్లుడు కొత్త కారు కొన్నాడన్న సంతోషంతో పూజకు సిద్ధమవుతున్న ఉమేశ్‌కు ఇంట్లో ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో భద్రపరిచిన తన భార్య బంగారు ఆభరణాలు బీరువాలో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇది ఎవరో తెలిసిన వారి పనేనని అనుమానించిన వారు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో, నిరుద్యోగి అయిన సమర్ చవాన్ ఉన్నట్టుండి అంత ఖరీదైన థార్ కారు ఎలా కొనగలిగాడనే దానిపై పోలీసులకు అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాన్ని అంగీకరించాడు. మామ ఇంట్లో తానే బంగారం దొంగిలించినట్లు, ఆ డబ్బుతోనే కారు కొన్నట్లు ఒప్పుకున్నాడు.

సమర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతడిని, అతని నుంచి చోరీ సొత్తు కొనుగోలు చేసిన స్వర్ణకారుడిని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన సొమ్ముతో కొన్న మహీంద్రా థార్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మేనల్లుడి ఘనకార్యంతో ఉమేశ్ కుటుంబం నివ్వెరపోయింది.