యంగ్ హీరో, దర్శకుడు విష్వక్ సేన్ ఏర్పాటు చేసిన ఫ్యాన్ ఫొటో సెషన్‌లో గందరగోళం తలెత్తింది. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఆయన దర్శకత్వం వహించి, నటించిన 'కల్ట్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, అంచనాలకు మించి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేయాల్సి రాగా, ఈ ఘటనపై విష్వక్ సేన్ అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, అక్టోబర్ 30న విడుదల కానున్న 'కల్ట్' సినిమా ప్రచారంలో భాగంగా విష్వక్ సేన్ అభిమానులతో ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. అయితే, నిర్వాహకుల అంచనాలు తలకిందులు చేస్తూ వేలాది మంది అభిమానులు రావడంతో భద్రతా ఏర్పాట్లు సరిపోలేదు. దీంతో తోపులాట జరిగి, పరిస్థితి చేయిదాటిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా విష్వక్ సేన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, దూరప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

ఈ ఘటనపై విష్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. "ఫొటో సెషన్ సమయంలో మీకు కలిగిన అసౌకర్యానికి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నాతో ఫోటో దిగాలని వచ్చి, అవకాశం దక్కక నిరాశతో వెనుదిరిగిన ప్రతి అభిమానికి సారీ. మీ అందరినీ పలకరించలేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది" అని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ ఊహించని స్థాయిలో ఉందని, త్వరలోనే పటిష్ఠమైన భద్రత, మెరుగైన ఏర్పాట్లతో మరోసారి ఫ్యాన్ మీట్ నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు.