పింఛన్ దరఖాస్తులను అధికారులు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచినట్లయితే, ఆ కాలానికి సంబంధించిన బకాయిలను కూడా తప్పనిసరిగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన జాప్యం కారణంగా దరఖాస్తును ఆలస్యంగా ఆమోదించినప్పటికీ, దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచే పింఛన్ బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన తాడిశెట్టి తిరుపతమ్మ ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. దివ్యాంగుల పింఛన్ పొందుతున్న ఆమె భర్త హరికృష్ణ 2023 జులైలో అనారోగ్యంతో మరణించారు. అనంతరం ఆమె వితంతు పింఛన్ కోసం 2024 మార్చి 16న దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అధికారులు ఆ పింఛన్‌ను 2026 ఫిబ్రవరి నుంచి మాత్రమే మంజూరు చేశారు. దీంతో, దరఖాస్తు చేసిన నాటి నుంచి మధ్యంతర కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ దరఖాస్తులను 21 పనిదినాల్లోగా పరిష్కరించాలని ఆయన గుర్తు చేశారు. సకాలంలో స్పందించకుండా ఎన్నికల కోడ్ వంటి కారణాలను సాకులుగా చూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 2024 జులై 1 నుంచి మూడు నెలల బకాయిలతో కలిపి పింఛన్ చెల్లించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది.

ఈ నేపథ్యంలో, పిటిషనర్ దరఖాస్తు చేసుకున్న నాటి నుంచే బకాయిలు పొందేందుకు అర్హులని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించింది.