గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరు వద్ద కృష్ణా నదిలో నాటుపడవ మునిగిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అర్జున్ (17), హర్ష (18)గా గుర్తించారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రాతూరు గ్రామానికి చెందిన ఈశ్వర్, సందీప్, సంతోష్, అర్జున్, హర్ష అనే ఐదుగురు స్నేహితులు శనివారం సరదాగా నాటుపడవలో నదీపాయను దాటి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవలోకి నీరు చేరడంతో అది నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి సందీప్, సంతోష్, ఈశ్వర్ ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. అర్జున్, హర్ష నదిలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులలో ఒకరైన హర్ష తాడికొండలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చి ఇలా మృత్యువాత పడటం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హర్ష తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అర్జున్ పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.