తన కారుపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తొలిసారిగా స్పందించాడు. తాను ఇప్పటికీ తీవ్ర షాక్‌లో ఉన్నానని, తనకు ఎవరితోనూ శత్రుత్వం లేనప్పుడు తనపై ఎందుకు దాడి జరిగిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి విచారించగా, టైగర్ ఈ విషయాలు వెల్లడించాడు.

అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో జుహూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫుట్‌బాల్ సెషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు టైగర్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై ఐదు నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ సమయంలో కారు ముందు ప్యాసింజర్ సీటులో ఉన్న టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, కారు డ్రైవర్ ఫిర్దౌస్ బలోచ్, వ్లాగర్ ఉమేశ్ చౌహాన్‌లకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన టైగర్, స్వయంగా కారు నడుపుతూ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాడు.

ఘటన తర్వాత పారిపోయిన షూటర్లను పోలీసులు గుర్తించారు. హర్యానాకు చెందిన ఫూల్ సింగ్ (18), రెహాన్ రైసుద్దీన్ అన్సారీ (18), బిహార్‌కు చెందిన హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ (22)లను మరుసటి రోజే రాజస్థాన్‌లోని కోటాలో అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన టర్కీ మేడ్ పిస్టల్ మధ్యలోనే జామ్ అయినట్లు, రెండు బుల్లెట్లు కిందపడిపోయినట్లు తెలిసింది. ఆయుధాలను సూరత్‌లోని బస్ స్టాండ్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్‌తో టైగర్ ష్రాఫ్ సన్నిహితంగా ఉండటమే ఈ దాడికి కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మందిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన ఇండోర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. నేపాల్‌కు పారిపోయేందుకు నిందితులు వేసిన ప్రణాళిక, కుట్ర వెనుక ఉన్న సూత్రధారులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.