ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లుయెన్సర్) అవధూత్ సాఠే, ఆయన నేతృత్వంలోని సంస్థపై మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) కఠిన చర్యలు చేపట్టింది. స్టాక్ మార్కెట్ శిక్షణ ముసుగులో మదుపర్ల నుంచి సేకరించిన రూ. 546.17 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. అవధూత్ సాఠే ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌టీఏపీఎల్‌) అనే సంస్థ స్టాక్ మార్కెట్ విద్య పేరిట సోషల్ మీడియా వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, సెబీ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ సంస్థ పెట్టుబడి సలహాలు, రీసెర్చ్ అనలిస్ట్ సేవలు అందిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

ఈ నేపథ్యంలో మదుపర్ల నుంచి వసూలు చేసిన రూ. 546.17 కోట్లతో పాటు దానికి అదనంగా రూ. 67.87 కోట్ల వడ్డీని కూడా చెల్లించాలని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ సంస్థతో పాటు దాని వ్యవస్థాపకుడు అవధూత్ సాఠే, డైరెక్టర్ గౌరీ అవధూత్ సాఠేలపై కలిపి మొత్తం రూ. 11.5 కోట్ల జరిమానా విధించింది. అంతేకాకుండా మదుపర్లకు నగదు వాపసు ప్రక్రియ పూర్తయ్యే వరకు లేదా రెండేళ్ల పాటు (ఏది ఆలస్యమైతే అది) అవధూత్ సాఠే మరియు ఆయన సంస్థ సెక్యూరిటీల మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించకుండా సెబీ నిషేధం విధించింది.