ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి తొలిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసులను ఆదివారం (అక్టోబర్ 25) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఉత్తరాంధ్ర నుంచి ఢిల్లీకి ఇదే మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లైట్ కావడం గమనార్హం.

ఈ కొత్త సర్వీసు షెడ్యూల్ ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు ఢిల్లీలో బయలుదేరే విమానం, ఉదయం 8:00 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అనంతరం, ఇక్కడి నుంచి తొలి సర్వీసుగా ఉదయం 8:30 గంటలకు అదే విమానం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతుంది.

ఈ చారిత్రక సేవలను ప్రారంభించడం కోసం విమానాశ్రయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. జీఎంఆర్ సీఈవో/సీసీఏఓ కన్వర్ బీర్ సింగ్ కారా, ఆకాశ ఎయిర్‌లైన్స్ మేనేజర్ భూపతిరాజు అచ్యుత రామరాజు ఈ కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసి, తొలి ప్రయాణికులకు టికెట్లను స్వయంగా అందజేయనున్నారు.

ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఢిల్లీ వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ కొత్త డైరెక్ట్ సర్వీసుతో ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సులభతరం, సౌకర్యవంతం కానుంది. ఈ పరిణామం పట్ల ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.