యూపీఐ లావాదేవీలపై కొత్త ఛార్జీలు.. పండుగల తర్వాత అమలు చేయాలంటున్న ట్రేడర్లు
Add ap7am to your home Screen

యూపీఐ లావాదేవీలపై కొత్త ఛార్జీలు.. పండుగల తర్వాత అమలు చేయాలంటున్న ట్రేడర్లు

New charges on UPI transactions traders want implementation after festivals
  • అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ఛార్జీలు 
  • రూ.2,000 దాటిన వ్యాపార లావాదేవీలపై కొత్త ఛార్జీల‌ వర్తింపు
  • ఈ మార్పులు కేవలం 4శాతం వ్యాపార లావాదేవీలకే వర్తిస్తాయని ఎన్‌పీసీఐ స్పష్టీక‌ర‌ణ‌
  • ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయవద్దని వ్యాపారులకు బ్యాంకులు సూచన‌
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై కొత్తగా ప్రతిపాదించిన 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (ఎండీఆర్‌) ఛార్జీల అమలును వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంఘాలు 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (ఎన్‌పీసీఐ)ని కోరాయి. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పండుగ సీజన్ ముగిసే వరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం వరకు దీనిని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' తన కథనంలో పేర్కొంది.

పండుగల సమయంలో అమ్మకాలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని, ఈ కీలక తరుణంలో కొత్త ఛార్జీలు అమలు చేస్తే వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ట్రేడ్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్‌పీసీఐ ఈ కొత్త ఎండీఆర్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. అయితే, వ్యాపారుల తాజా విజ్ఞప్తిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఎన్‌పీసీఐ ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన వ్యాపార కేటగిరీలలో రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ.5 రుసుము విధిస్తారు. అదే సమయంలో, పెద్ద వ్యాపారులకు రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఫీజు ఉంటుంది. దీనిపై గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీల వంటి క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. దీనికి కూడా గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుంది.

అయితే, ఈ మార్పుల వల్ల కేవలం 4 శాతం వ్యాపార లావాదేవీలపై మాత్రమే ప్రభావం పడుతుందని, 95 శాతానికి పైగా పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) యూపీఐ చెల్లింపులకు ఈ ఛార్జీలు వర్తించవని ఎన్‌పీసీఐ అంచనా వేసింది. పీర్-టు-పీర్ (పీ2పీ) మోడల్‌ను ఉపయోగించే చిన్న వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్‌ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. సాధారణ వ్యక్తిగత వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం ఉండదు. వారు యథావిధిగా ఉచితంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు.

ఈ ఎండీఆర్‌ ద్వారా వసూలైన ఆదాయాన్ని యూపీఐ వ్యవస్థ విస్తరణ, సైబర్‌ సెక్యూరిటీ మెరుగుదల, ఆవిష్కరణల కోసం వినియోగించనున్నారు. మొత్తం ఎండీఆర్‌ వసూళ్లలో 5 శాతాన్ని చిన్న వ్యాపారులలో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసే ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. ముఖ్యంగా, ఈ ఎండీఆర్‌ ఛార్జీలను వ్యాపారులు కస్టమర్లపై మోపకుండా చూడాలని బ్యాంకులకు ఎన్‌పీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
NPCI
UPI Transaction Charges
Merchant Discount Rate
Digital Payments India
UPI MDR New Rules
Indian Traders Association

More Telugu News