జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు.. కార‌ణ‌మిదే!

జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు.. కార‌ణ‌మిదే!

GHMC Commissioner receives contempt notice for ignoring court orders
  • గాంధీ జయంతి నాడు మాంసం దుకాణాల మూసివేతపై వివాదం
  • పాత కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపణ
  • కమిషనర్‌పై చర్యలు తీసుకుని, రూ.50,000 జరిమానా విధించాలని అభ్యర్థన
గాంధీ జయంతి సందర్భంగా నగరంలో మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పాత కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై నిన్న‌ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

తార్నాకకు చెందిన న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలో ఇలాంటి ఉత్తర్వులపై శ్రీకాంత్ కోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్లాటర్‌హౌస్‌లు, మాంసం దుకాణాల మూసివేతకు సంబంధించిన ఏ ఉత్తర్వులైనా జీహెచ్ఎంసీ చట్టం-1955 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టుకు వివరించారు.

అయితే, ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్లాటర్‌హౌస్‌లు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని సెప్టెంబర్ 30న జీహెచ్ఎంసీ పత్రికా ప్రకటన విడుదల చేసిందని ఆయన వాదించారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం రూపొందించిన నిబంధనలను గెజిట్‌లో ప్రచురించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. మాంసం దుకాణాల మూసివేత వ్యాపారుల ప్రాథమిక హక్కులను (ఆర్టికల్ 19(1)(g)) ఉల్లంఘిస్తుందని తెలిపారు.

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయనకు రూ.50,000 జరిమానా విధించాలని పిటిషన్‌లో కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం, కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Advertisement
RV Karnan
GHMC Commissioner
Telangana High Court
Contempt of court notice
Gandhi Jayanti meat shop closure
GHMC Act 1955

More Telugu News