4 లక్షలు తీసుకుంటూ ఒకరు.. లక్ష తీసుకుంటూ మరొకరు.. ఏసీబీ చేతికి చిక్కిన ఇద్దరు మహిళా అధికారులు

4 లక్షలు తీసుకుంటూ ఒకరు.. లక్ష తీసుకుంటూ మరొకరు.. ఏసీబీ చేతికి చిక్కిన ఇద్దరు మహిళా అధికారులు

One taking 4 lakhs and another taking 1 lakh two women officers caught by ACB
  • రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి అరెస్ట్
  • రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
  • జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత అరెస్ట్
  • నిర్మాణ అనుమతుల కోసం రూ.4 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత
అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ ఏసీబీ అధికారులు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఇద్దరు మహిళా ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసీరామ్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న స్వర్ణకుమారి ఎల్‌బీనగర్‌లో అనుమతి లేకుండా నడుస్తున్న ఓ ఫిజియోథెరపీ కేంద్రంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, కొత్త లైసెన్స్ ఇచ్చేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ద్వారా రూ. లక్షను స్వీకరించి, తన ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యకు అప్పగించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, డబ్బుతో వెళ్తున్న కృష్ణయ్యను పట్టుకున్నారు. అనంతరం స్వర్ణకుమారి నివాసం, కార్యాలయంలో సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వర్ణకుమారితో పాటు శ్రీనివాస్, కృష్ణయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    
మరో ఘటనలో, జీహెచ్‌ఎంసీ మెహిదీపట్నం జోన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసీరామ్ సునీత, నిర్మాణ అనుమతుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద లెక్కల్లో చూపని మరో రూ.2.50 లక్షల నగదును కూడా గుర్తించి, మొత్తం రూ.6.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి, నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ రెండు ఘటనలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Advertisement
Swarna Kumari
Tulasiram Sunitha
Telangana ACB
Rangareddy DMHO bribe case
GHMC Town Planning ACB raid
Hyderabad corruption arrests

More Telugu News