వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల్లో ముందడుగు.. బౌండరీ వాల్‌కు టెండర్ ఖరారు
Advertisement

వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల్లో ముందడుగు.. బౌండరీ వాల్‌కు టెండర్ ఖరారు

Warangal Airport works progress boundary wall tender finalized
  • ప్రహరీ నిర్మాణానికి టెండర్ ఖరారు చేసిన ఏఏఐ
  • రూ.13.28 కోట్లకే పనులు దక్కించుకున్న సైదాక్స్ ఇన్ఫ్రా
  • అంచనా కన్నా తక్కువకు బిడ్.. ప్రభుత్వానికి రూ.8 కోట్లు ఆదా
  • 15 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం
వరంగల్ (మామనూరు) ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మొదటి దశ పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేసింది. ఎయిర్‌పోర్టుకు కొత్తగా సేకరించిన భూమికి రక్షణ గోడ (బౌండరీ వాల్) నిర్మించే పనులను హైదరాబాద్‌కు చెందిన సైదాక్స్ ఇంజనీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

ఈ కాంట్రాక్టును సెప్టెంబర్ 29న ఖరారు చేశారు. ఈ పనుల కోసం ఏఏఐ రూ.21.39 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించగా, సైదాక్స్ సంస్థ కేవలం రూ.13.28 కోట్లకే పనులు పూర్తి చేస్తామని బిడ్ దాఖలు చేసింది. ఇది అంచనా వ్యయం కంటే 37.89 శాతం తక్కువ. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.8.10 కోట్లు ఆదా కానుంది.

కాంట్రాక్టు ప్రకారం, కొత్తగా సేకరించిన 283 ఎకరాల భూమి చుట్టూ ప్రీకాస్ట్ బౌండరీ వాల్ నిర్మించడంతో పాటు, పాత ప్రహరీ ఎత్తును కూడా పెంచనున్నారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనలకు అనుగుణంగా ఈ పనులు జరుగుతాయి. అక్టోబర్ 9న పనులు ప్రారంభించి, 15 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం, అక్టోబర్ 14లోపు సైదాక్స్ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులోని ఏఏఐ కార్యాలయంలో అధికారిక ఒప్పందంపై సంతకాలు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం రూ.285 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి ఏఏఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ప్రహరీ పనుల తర్వాత టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలకు కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 2028 జూన్ నాటికి ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
Warangal Airport
Mamnoor Airport
Airports Authority of India
Sydax Engineers and Infrastructures
Telangana Government
Airport Boundary Wall

More Telugu News