పొలంలో మొదలైన ప్రయాణం.. ఒలింపిక్స్ బెర్త్ వ‌ర‌కు.. తెలంగాణ ఆర్చర్ చికిత స‌క్సెస్ జ‌ర్నీ!
Advertisement

పొలంలో మొదలైన ప్రయాణం.. ఒలింపిక్స్ బెర్త్ వ‌ర‌కు.. తెలంగాణ ఆర్చర్ చికిత స‌క్సెస్ జ‌ర్నీ!

Taniparthi Chikitha journey from farm fields to Los Angeles Olympics berth
  • జపాన్‌లో సత్తా చాటిన తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత
  • రెండు స్వర్ణాలు గెలిచి లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత
  • తండ్రే తొలి కోచ్.. పొలంలోని గడ్డివామే తొలి టార్గెట్
  • కూతురి క్రీడా పరికరాల కోసం వరికోత యంత్రం అమ్మిన తండ్రి
  • అంతర్జాతీయ వేదికలపై పతకాలతో నిలకడైన ప్రదర్శన
తెలంగాణకు చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించింది. జపాన్‌లో జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఏకంగా రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ విజయంతో ఆమె ప్రతిష్ఠాత్మక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు బెర్త్ ఖరారు చేసుకుంది.

చికిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం 
పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామ వాసి అయిన చికిత ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆరేళ్ల వయసులో ఆమెను ఆర్చర్‌గా చూడాలని తండ్రి శ్రీనివాసరావు కల కన్నారు. గ్రామంలో సరైన వసతులు లేకపోవడంతో ఆయనే తొలి కోచ్‌గా మారారు. పొలంలో వరి కోతల తర్వాత మిగిలిన గడ్డివామునే లక్ష్యంగా చేసి చికితతో ప్రాక్టీస్ చేయించారు. 

ఖరీదైన విల్లు, క్రీడా పరికరాల కోసం తమ జీవనాధారమైన వరికోత యంత్రాన్ని అమ్మి, బ్యాంకులో రుణం తీసుకోవడం ఆయన త్యాగానికి నిదర్శనం. తండ్రి ప్రోత్సాహంతో జాతీయ సబ్-జూనియర్ పోటీల్లో రెండు పతకాలు గెలిచిన చికిత, నాలుగేళ్ల క్రితం సోనేపట్‌లోని సాయ్ ఆర్చరీ అకాడమీలో చోటు దక్కించుకుంది. 

అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. గత ఏడాది చైనాలో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, ఆసియా కప్‌లో కాంస్యం, వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి తన సత్తా చాటింది. ఈ ఏడాది వరల్డ్ కప్, ఆసియా కప్‌లలోనూ పతకాలతో రాణించిన ఆమె, ఇప్పుడు జపాన్‌లో రెండు స్వర్ణాలను ముద్దాడి ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకంపై బలమైన ఆశలు రేకెత్తించింది.
Advertisement
Taniparthi Chikitha
Telangana Archer
Los Angeles Olympics
Indian Archery Gold
Peddapalli Sultanpur
Archery Success Story

More Telugu News