ఎమ్మెల్సీ టికెట్లపై తీన్మార్ మల్లన్న ఫైర్.. జానారెడ్డి కుట్ర అంటూ సంచలన ఆరోపణ
Advertisement

ఎమ్మెల్సీ టికెట్లపై తీన్మార్ మల్లన్న ఫైర్.. జానారెడ్డి కుట్ర అంటూ సంచలన ఆరోపణ

Teenmar Mallanna fires on MLC tickets and alleges Jana Reddy conspiracy
  • రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
  • రెండు స్థానాలు రెడ్లకే ఇచ్చారని తీన్మార్ మల్లన్న విమర్శ
  • రాష్ట్రంలో బీసీ వాదం లేదని నిరూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపాటు
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా వేడి పుట్టించింది. రెండు సీట్లనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడంపై తెలంగాణ రాజ్య అధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, సీనియర్ నేత జానారెడ్డి నాటకమాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి సామ రామ్మోహన్‌ రెడ్డిని, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి రామిరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది. దీనిపై మల్లన్న మాట్లాడుతూ... ఈ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. "రెడ్ల పార్టీ రెడ్లకు కాకుండా బీసీలకు టికెట్లు ఇస్తేనే ఆశ్చర్యపడాలి" అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లోని రెడ్లు ఓ నాటకమాడారని, ఈ కేటాయింపుల వెనుక జానారెడ్డితో పాటు మరో టీచర్ ఎమ్మెల్సీ, ఇంకో రెడ్డి నేత కుట్ర ఉందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు కేవలం 'బలిపశువులు' మాత్రమేనని మల్లన్న అభివర్ణించారు. పార్టీ గెలవడం కాదు, రెడ్లు గెలవాలన్నదే వారి లక్ష్యమని, దీని కోసం బీఆర్ఎస్‌లోని ఒక వ్యక్తితో రహస్య ఒప్పందం కూడా కుదిరిందని ఆరోపించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు గతంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని, తాను గెలిచిన తర్వాతే అక్కడ ఆ పార్టీకి గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు.

ఈ ఎన్నికలు రెడ్లు, వెలమలకు, బీసీలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో బీసీ వాదం లేదని నిరూపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ తెలంగాణ రాజ్య అధికార పార్టీ తరఫున రెండు స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తామని తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వంపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు.

Advertisement
Teenmar Mallanna
Jana Reddy
Congress MLC candidates
Telangana Graduate MLC elections
Sama Rammohan Reddy
Ramireddy Sarvottam Reddy

More Telugu News