ప్రిన్సెస్‌ డయానా జీవితంలో ఎవరూ చూడని కోణం.. సోదరుడి పుస్తకంలో సంచలన విషయాలు

ప్రిన్సెస్‌ డయానా జీవితంలో ఎవరూ చూడని కోణం.. సోదరుడి పుస్తకంలో సంచలన విషయాలు

Princess Diana Life Unseen Angle Sensational Revelations in Brother Charles Spencer Book
  • చార్లెస్‌ స్పెన్సర్‌ తాజా పుస్తకం ‘స్వాన్‌ సాంగ్‌: డయానా, మై సిస్టర్‌’లో సంచలన విషయాలు
  • బ్రిటన్‌ను వదిలి దక్షిణాఫ్రికాలో జీవించాలని డయానా కలలు కన్నట్లు వెల్లడి
  • హస్నత్‌ ఖాన్‌తో కలిసి కేప్‌టౌన్‌లో స్థిరపడాలనుకున్నారని వెల్లడి
  • 1995లో మొదలై 1997లో ముగిసిన డయానా-హస్నత్‌ ప్రేమ బంధం
  • డయానా బాధను పుస్తకంలో గుర్తుచేసుకున్న సోదరుడు
బ్రిటన్‌ను వదిలి దక్షిణాఫ్రికాలో కొత్త జీవితం మొదలుపెట్టాలని బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన దివంగత మాజీ యువరాణి డయానా ఒకప్పుడు కలలు కన్నారట. తనకు అత్యంత సన్నిహితుడైన పాకిస్థానీ-బ్రిటిష్‌ గుండె వైద్యుడు డాక్టర్‌ హస్నత్‌ ఖాన్‌తో కలిసి కేప్‌టౌన్‌లో సాధారణ జీవితం గడపాలని ఆమె భావించినట్లు డయానా సోదరుడు చార్లెస్‌ స్పెన్సర్‌ తన తాజా పుస్తకం ‘స్వాన్‌ సాంగ్‌: డయానా, మై సిస్టర్‌’లో వెల్లడించారు. బ్రిటన్‌లో జీవితాన్ని భరించలేకపోతున్నానని భావించిన డయానా.. దక్షిణాఫ్రికాను ఓ కొత్త ఆశ్రయంగా చూసుకున్నారని పేర్కొన్నారు.

సర్జన్‌కు ఉద్యోగం కోసం ప్రయత్నాలు
డయానా ఆలోచనలు కేవలం కలలకే పరిమితం కాలేదని స్పెన్సర్‌ తెలిపారు. అప్పట్లో కేప్‌టౌన్‌లోని గ్రూట్‌ షూర్‌ ఆసుపత్రిలో పనిచేసిన ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ క్రిస్టియన్‌ బార్నార్డ్‌ను ఆమె కలిసినట్లు చెప్పారు. హస్నత్‌ ఖాన్‌కు అక్కడ సరైన వైద్య ఉద్యోగం దొరికేలా బార్నార్డ్‌ సహాయం చేయగలరా అని డయానా ఆరా తీశారని వివరించారు. బార్నార్డ్‌ కూడా ఈ విషయంలో అవకాశాలను పరిశీలిస్తున్నట్లు స్పెన్సర్‌కు చెప్పారట.

‘సాధారణ జీవితం’ కోసం..
1997 మార్చిలో తనని కలవడానికి దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు డయానా చాలా అసంతృప్తిగా ఉన్నారని స్పెన్సర్‌ గుర్తుచేసుకున్నారు. బ్రిటన్‌ జీవితాన్ని తాను భరించలేకపోతున్నానని చెప్పినట్లు వెల్లడించారు. విలియం, హ్యారీ బ్రిటన్‌లో చదువుకుంటుండటంతో.. తాను మాత్రం దూరంగా వెళ్లి కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని డయానా భావించినట్లు చెప్పారు.

హస్నత్‌తో ప్రేమ బంధం
డయానా, హస్నత్‌ ఖాన్‌ 1995లో లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌ ఆసుపత్రిలో తొలిసారి కలిశారు. ఓ స్నేహితురాలి భర్త గుండె చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆయన పరిచమయ్యారు. ఆ తర్వాత హస్నత్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. కొన్ని వారాల పాటు దాదాపు రోజూ ఆసుపత్రికి వెళ్లినట్లు స్పెన్సర్‌ తెలిపారు. కొంతకాలానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు చెప్పారు.

రహస్యంగా సాగిన ప్రేమ
డయానా-హస్నత్‌ తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఆయన్ను కలవడానికి డయానా ఒకసారి నల్ల విగ్‌ ధరించి జాజ్‌ క్లబ్‌కు వెళ్లారని చెబుతారు. హస్నత్‌ కూడా రహస్యంగా కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు కారు డిక్కీలో దాక్కున్నట్లు స్పెన్సర్‌ రాశారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించారట. అయితే డయానా పెళ్లి విషయాన్ని ప్రస్తావించినా.. హస్నత్‌ దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.

చివరికి ముగిసిన బంధం
1997 వేసవిలో డయానా-హస్నత్‌ బంధం ముగిసింది. ఆ తర్వాత ఆమె ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్‌ అల్‌-ఫయాద్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగారు. ఆయన కుమారుడు డోడీతోనూ సంబంధం ఏర్పడింది. 1997 ఆగస్టులో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో డయానా, డోడీ మరణించారు. 2008లో జరిగిన విచారణలో హస్నత్‌.. డయానాతో పెళ్లి జరిగితే తమకు సాధారణ జీవితం సాధ్యం కాదని భావించినట్లు చెప్పిన విషయం కూడా స్పెన్సర్‌ పుస్తకంలో ప్రస్తావించారు.

సోదరి బాధను గుర్తుచేసుకున్న స్పెన్సర్‌
దక్షిణాఫ్రికా పర్యటనలో డయానా తీవ్రంగా బాధపడ్డారని స్పెన్సర్‌ చెప్పారు. హస్నత్‌ ఫోన్‌ కోసం ఆమె గంటల తరబడి ఎదురుచూసేవారని, కానీ అతడి నుంచి ఫోన్‌ రాకపోవడంతో నిరాశ చెందేవారని రాశారు. అప్పటికి ఆమెకు తినే అలవాట్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా మారిందని పేర్కొన్నారు. తన సోదరి అంతగా బాధపడుతుండటం చూసి తాను ఎంతో కలత చెందానని స్పెన్సర్‌ తెలిపారు.
Advertisement
Princess Diana
Charles Spencer
Hasnat Khan
A Swan Song book
South Africa move
British Royal Family

More Telugu News