రాప్తాడులో మంత్రి లోకేశ్‌కు బ్రహ్మరథం.. ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల ఆవిష్కరణ

రాప్తాడులో మంత్రి లోకేశ్‌కు బ్రహ్మరథం.. ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల ఆవిష్కరణ

Nara Lokesh grand welcome in Raptadu and unveiling of NTR Paritala statues
  • రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి లోకేశ్‌
  • పరిటాల సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం
  • భారీ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అభివాదం చేసిన లోకేశ్‌
  • అనంతరం ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరణ
  • అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆయనకు రాప్తాడు కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ గజమాలతో మంత్రి లోకేశ్‌కు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు తరలివచ్చారు.

మంత్రి లోకేశ్‌ రాక సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు జరుపుకున్నారు. రాప్తాడు సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు యువనేత నారా లోకేష్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పరిటాల శ్రీరామ్‌తో కలిసి వాహనంపైకి ఎక్కిన లోకేశ్‌, దారిపొడవునా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

పార్టీ జెండాలు చేతబూనిన కార్యకర్తలు 'జై తెలుగుదేశం' నినాదాలతో రాప్తాడు రహదారులను హోరెత్తించారు. ఈ ర్యాలీ కారణంగా ఆ ప్రాంతమంతా పసుపుమయంగా మారింది.

ర్యాలీ అనంతరం మంత్రి లోకేశ్‌ తొలుత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాప్తాడు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత నేత పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో రాప్తాడులో పండుగ వాతావరణం నెలకొంది.
Advertisement
Nara Lokesh
Raptadu
Paritala Sunitha
NT Rama Rao statue
Paritala Ravindra statue
TDP rally Anantapur

More Telugu News