టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం.. అమెరికాలో రాజకీయ దుమారం

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం.. అమెరికాలో రాజకీయ దుమారం

90 Foot Hanuman Statue in Texas Sparks Political Storm in America
  • కూల్చేస్తామంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలతో రాజుకున్న దుమారం
  • ఇది హిందూ మతంపై దాడి అంటూ అమెరికాలోని హిందూ సంఘాల ఆగ్రహం
  • అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ మతపరమైన చర్చకు దారితీసిన ఘటన
  • విగ్రహం ప్రైవేట్ ఆస్తిలో ఉందని, ఐక్యతకు చిహ్నమని ఆలయ వర్గాల వెల్లడి
అమెరికాలోని టెక్సాస్‌లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం ఇప్పుడు రాజకీయ, మతపరమైన వివాదానికి కేంద్రంగా మారింది. ఈ విగ్రహాన్ని కూల్చేస్తామంటూ ఓ కన్జర్వేటివ్ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇది హిందూ మతంపై జరిగిన దాడిగా అక్కడి హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై కన్జర్వేటివ్ యూట్యూబర్ జెస్సీ హ్యూస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "మేము గెలిచినప్పుడు ఈ విగ్రహాన్ని కూల్చేస్తాం" అని పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్య తీవ్ర దుమారం రేపడంతో పాటు అమెరికాలోని హిందూ సమాజం నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చింది.

జెస్సీ వ్యాఖ్యలపై అమెరికా సైన్యంలో పనిచేసిన రుచిర్ బ‌క్షీ తీవ్రంగా స్పందించారు. ఇది హిందూ మతంపై జరిగిన దాడి అని, దేశభక్తి లేని చర్య అని ఆయన మండిపడ్డారు. కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (CoHNA) వంటి సంస్థలతో పాటు ఇతర సైనికోద్యోగులు కూడా హిందూ సమాజానికి మద్దతుగా నిలిచారు. తమ ప్రార్థనా స్థలాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు.

ఈ ఏడాది 2024 ఆగస్టులో 'స్టాట్యూ ఆఫ్ యూనియన్' పేరుతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది అమెరికాలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాల్లో ఒకటి. అయితే, విగ్రహ ఏర్పాటు నుంచే కొందరు క్రిస్టియన్ కన్జర్వేటివ్‌లు దీనిని 'క్రైస్తవ వ్యతిరేకం' అని, 'దొంగ దేవుడు' అని విమర్శిస్తున్నారు.

టెక్సాస్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది. వలసలు, సాంస్కృతిక గుర్తింపు వంటి అంశాలపై జరుగుతున్న విస్తృత చర్చకు ఇది అద్దం పడుతోంది. టెక్సాస్‌లో భారతీయ-అమెరికన్ల జనాభా గణనీయంగా ఉండటం కూడా ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముతోంది. 

ఈ వివాదంపై ఆలయ అధికారులు స్పందిస్తూ, ఈ విగ్రహం తమ ప్రైవేట్ ఆస్తిలో ఉందని, ఇది స్థానిక హిందూ సమాజం భక్తికి, ఐక్యతకు చిహ్నమని వారు వివరించారు.
Advertisement
Hanuman Statue
Texas Sugar Land
Jesse Hughes
Statue of Union
US Hindu Temple
Texas Religious Politics

More Telugu News