స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం.. 100 శాతం స్ట్రైక్ రేట్ ఖాయం: నాదెండ్ల మనోహర్
- ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనేది ముఖ్యం కాదన్న మనోహర్
- కచ్చితంగా విజయం సాధించే స్థానాల్లో పోటీ చేయడమే ముఖ్యమని వ్యాఖ్య
- పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నారని వెల్లడి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందని, వందకు వంద శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాలు సాధిస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై మాట్లాడారు.
అభ్యర్థుల ఎంపికలో ఏవైనా పొరపాట్లు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, స్థానిక వార్డుల వారీగా బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే సంఖ్య కంటే, గెలిచే బలం ఉన్న స్థానాల్లో నిలబడి కచ్చితమైన విజయం సాధించడమే ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాజకీయాల్లో అనుభవమే అసలైన పాఠమని పేర్కొంటూ, జీవీఎంసీ పరిధిలో గతంలో గెలిచిన, రెండో స్థానంలో నిలిచిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కేవలం టికెట్ వస్తే సరిపోదని... ప్రజల అవసరాలు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కేడర్ నిరంతరం శ్రమించాలని నిర్దేశించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యత వల్లే రాష్ట్రంలో పెట్టుబడిదారులకు కొండంత భరోసా లభించిందని, ఉత్తరాంధ్రకు వస్తున్న భారీ ప్రాజెక్టులే దీనికి నిదర్శనమని చెప్పారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని తెలిపారు.