అక్టోబర్ 1న కరవు మండలాలను అధికారికంగా ప్రకటించండి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

అక్టోబర్ 1న కరవు మండలాలను అధికారికంగా ప్రకటించండి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu orders official drought declaration on October 1
  • రాష్ట్రవ్యాప్తంగా 513 మండలాల్లో కరవు ఛాయలు ఉన్నట్టు ప్రాథమిక అంచనా
  • పంట నష్టాన్ని నివారించి, సూక్ష్మ సేద్యం, ప్రకృతి సాగును ప్రోత్సహించాలని సూచన
  • తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, విశాఖపై ప్రత్యేక కార్యాచరణకు ఆదేశం
  • ఎల్‌నినో ప్రభావంతో ఉద్యాన పంటల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్దేశం
  • రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి, అక్టోబర్ 1న కరవు మండలాలను అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడా పంట నష్టం జరగకుండా, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కరవు పరిస్థితులపై ప్రతీ నెలా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ-ఉద్యాన పంటల పరిస్థితి, రైతుల ఇబ్బందులు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కరువు మండలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వర్షపాతం, పంటల సాగు, భూగర్భ జలాలు, నేలలో తేమ శాతం, ఉపగ్రహ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు వంటి ఆరు కీలక అంశాలను సమగ్రంగా విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

513 మండలాల్లో కరవు ఛాయలు

2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 513 మండలాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటిలో 268 మండలాల్లో తీవ్రమైన వర్షాభావం, 245 మండలాల్లో మోస్తరు వర్షాభావం నెలకొందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వ్యవసాయ శాఖ చేపడుతుందని, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు పంట, దిగుబడి నష్టాన్ని అంచనా వేస్తాయని చెప్పారు. ఈ నివేదికలను కలెక్టర్లు సెప్టెంబర్ 24లోగా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 29న జరిగే రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనలను పరిశీలించి, తుది జాబితాను సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఉద్యాన పంటల రక్షణ, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత

వర్షాభావ పరిస్థితులతో పాటు ఎల్‌నినో ప్రభావం వల్ల ఉద్యాన పంటలు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని పంటలు ‘హై రిస్క్’ కేటగిరీలో ఉన్నాయని, సుమారు 17,916 హెక్టార్లలో నారింజ, బత్తాయి, మామిడి, మిరప, ఉల్లి వంటి పంటలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. 

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ఉద్యాన పంటలను కాపాడేందుకు ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడేందుకు సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) వైపు రైతులను ప్రోత్సహించాలని నిర్దేశించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైతులకు అందుబాటులోకి తేవడాన్ని ప్రశంసించారు. సూక్ష్మ సేద్యంతో పాటు ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి.. విశాఖకు కార్యాచరణ

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బోర్లపై ఆధారపడిన ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించి తాగునీటి సరఫరా పనులను వేగవంతం చేయాలన్నారు. 

విశాఖ సమీపంలోని రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నింపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, మేఘాద్రిగడ్డకు పోలవరం ఎల్‌ఎంసీ ప్యాకేజీ-8 కింద పైపులైన్ ద్వారా నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం విశాఖ నగరానికి మరో రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Drought Mandals
AP Drought Declaration
Visakhapatnam Water Crisis
AP Micro Irrigation Project
Kharif Crop Loss

More Telugu News