ఫోర్డ్‌లాండియా: అమెజాన్ అడవిలో హెన్రీ ఫోర్డ్ కట్టిన పట్టణం ఎందుకు కనుమరుగైంది?

ఫోర్డ్‌లాండియా: అమెజాన్ అడవిలో హెన్రీ ఫోర్డ్ కట్టిన పట్టణం ఎందుకు కనుమరుగైంది?

Henry Ford Fordlandia why the city in Amazon jungle disappeared
  • కార్ల టైర్ల కోసం అమెజాన్‌లో హెన్రీ ఫోర్డ్ రబ్బరు ప్రాజెక్ట్
  • స్థానిక సంస్కృతిని కాదని అమెరికన్ పద్ధతులు.. పెల్లుబికిన తిరుగుబాటు
  • రబ్బరు చెట్లను ఒకేచోట నాటడం.. తెగుళ్లతో నాశనమైన తోటలు
  • భారీ నష్టాలతో బ్రెజిల్ ప్రభుత్వానికి ప్రాజెక్టు విక్రయం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫోర్డ్ మోటార్స్ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్, ఒకప్పుడు అమెజాన్ అడవుల నడిబొడ్డున అమెరికన్ జీవనశైలి ప్రతిబింబించేలా ఒక పట్టణాన్నే నిర్మించారు. తన కార్ల కర్మాగారాలకు అవసరమైన రబ్బరును నిరంతరాయంగా సరఫరా చేయాలనే లక్ష్యంతో 'ఫోర్డ్‌లాండియా' పేరుతో ఆయన ఒక భారీ ప్రాజెక్టును చేపట్టారు. అయితే, ఆ ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, చివరికి భారీ నష్టాలతో ఆ ప్రాజెక్టును విక్రయించాల్సి వచ్చింది.

1927-28 కాలంలో బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో, టపాజోస్ నదీ తీరంలో హెన్రీ ఫోర్డ్ సుమారు 10 లక్షల హెక్టార్ల భూమిని లీజుకు తీసుకున్నారు. కార్ల తయారీలో కీలకమైన టైర్లు, బెల్టులు వంటి విడిభాగాలకు కావాల్సిన రబ్బరును సొంతంగానే పండించాలన్నది ఆయన వ్యూహం. అప్పట్లో రబ్బరు వాణిజ్యంపై బ్రిటిష్, డచ్ దేశాల ఆధిపత్యాన్ని నిరోధించాలన్న సంకల్పంతో ఆయన ఈ అడుగు వేశారు. ఈ క్రమంలోనే అక్కడ స్విమ్మింగ్ పూల్, గోల్ఫ్ కోర్స్, సినిమా థియేటర్ వంటి సకల సౌకర్యాలతో కూడిన ఒక ఆధునిక పట్టణాన్ని నిర్మించారు.

అయితే, ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల విఫలమైంది. వ్యవసాయ నిపుణుల మార్గదర్శకత్వానికి బదులుగా పారిశ్రామిక నిర్వాహకులతో ప్రాజెక్టును నిర్వహించడం ప్రాథమిక తప్పిదంగా మారింది. అంతేకాకుండా, మద్యపానం, పొగాకుపై నిషేధం, అమెరికన్ పనివేళలు, ఆహారపు అలవాట్లను బలవంతంగా రుద్దడం వంటి కఠిన నిబంధనలను స్థానిక కార్మికులు అంగీకరించలేకపోయారు. ఇది 1930లో పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీసింది. వీటన్నింటికీ మించి, రబ్బరు చెట్లను అతి దగ్గరగా నాటడం వల్ల "సౌత్ అమెరికన్ లీఫ్ బ్లైట్" అనే శిలీంధ్రం, ఇతర కీటకాలు సులభంగా వ్యాపించి పంటను పూర్తిగా నాశనం చేశాయి.

అనంతరం "బెల్టెర్రా" అనే మరో ప్రాంతంలో నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును కొనసాగించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. ఫోర్డ్ సంస్థకు ఏడాదికి 38,000 టన్నులు రబ్బరు అవసరం కాగా, అక్కడ కేవలం 750 టన్నుల మాత్రమే ఉత్పత్తి అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కృత్రిమ (సింథటిక్) రబ్బరు అందుబాటులోకి రావడం, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకోవడంతో ఫోర్డ్ ప్రాజెక్టు ప్రాధాన్యత కోల్పోయింది. ఫలితంగా, సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1945లో ఫోర్డ్ మోటార్ కంపెనీ కేవలం 2,50,000 డాలర్లకే బ్రెజిల్ ప్రభుత్వానికి విక్రయించింది. ఇంతటి భారీ ప్రాజెక్టును నిర్మించిన హెన్రీ ఫోర్డ్, తన జీవితంలో ఒక్కసారి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడం గమనార్హం.
Advertisement
Henry Ford
Fordlandia
Amazon Rainforest
Rubber Production
Ford Motor Company
Brazil History

More Telugu News