తిరుమలలో నేటి సాయంత్రం గరుడ సేవ.. భారీస్థాయిలో ఏర్పాట్లు చేసిన టీటీడీ
- శ్రీవారి గరుడ సేవకు తిరుమలలో సర్వం సిద్ధం
- పెరటాసి మాసం శనివారం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు
- 9 లక్షల మందికి పైగా సరిపడా అన్నప్రసాదాలు, రవాణా సౌకర్యాలు
- ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
- సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి
కలియుగ వైకుంఠం తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు సర్వం సిద్ధమైంది. శనివారం సాయంత్రం మలయప్ప స్వామి తన ప్రియ వాహనమైన గరుత్మంతుడిపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుండటంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ ఏడాది గరుడ సేవ శనివారం రావడం, తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసంలో మొదటి శనివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. దీనికి తగ్గట్టుగానే పటిష్టమైన భద్రత, వసతులను కల్పించింది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో సుమారు 1.20 లక్షల మంది భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రించి, ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఊరేగింపు నిర్దిష్ట ప్రాంతాలను దాటిన తర్వాత భక్తులను రొటేషన్ పద్ధతిలో అనుమతించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఏడాది గరుడ సేవ నాడు 6.13 లక్షల అన్నప్రసాదాలు అందించగా, ఈసారి 9.30 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రసాదాలను 30 శాతం, పానీయాలను 50 శాతం అదనంగా సిద్ధం చేశారు. అదనంగా లక్ష మందికి భోజనాలు వండేందుకు ప్రత్యేక వంటశాలను సైతం ఏర్పాటు చేశారు.
రవాణా పరంగా ఆర్టీసీ 500 అదనపు ట్రిప్పులు నడుపుతుండగా, ఘాట్ రోడ్లపై శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ద్విచక్ర వాహనాలను నిషేధించారు. కొండపై రద్దీ పెరిగితే, తిరుపతిలోనే ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లలో భక్తులను నిలిపివేసి, వారికి ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందించనున్నారు. భద్రత కోసం సుమారు 3,000 మంది పోలీసులు, 2,500 మంది విజిలెన్స్ సిబ్బందిని మోహరించారు. తిరుమలలో ఐదు చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మాడవీధులు సహా 37 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఛైర్మన్, ఈవో
గరుడ సేవ ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం ఉదయం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మాడ వీధుల్లోని గ్యాలరీలకు వెళ్లి భక్తులతో ముఖాముఖి మాట్లాడారు. అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. టీటీడీ అందిస్తున్న వసతులపై తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ వంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈవో ఆదేశించారు. భక్తులు కూడా ఓర్పు, సంయమనంతో వ్యవహరించి, సిబ్బందికి సహకరించి స్వామివారి సేవను విజయవంతం చేయాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.