నటి శ్రీదేవి చెన్నై ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ

నటి శ్రీదేవి చెన్నై ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ

Sridevi Chennai property dispute hearing in Supreme Court
  • సుప్రీంకోర్టుకు చేరిన శ్రీదేవి చెన్నై ఆస్తి వివాదం
  • బోనీ కపూర్, జాన్వీ, ఖుషీ కపూర్‌లకు కోర్టు నోటీసులు జారీ
  • వివాదాస్పద ఆస్తిపై యథాతథ స్థితి పాటించాలని ఆదేశం
  • ఇరువర్గాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచన
  • 1988లో శ్రీదేవి కుటుంబం కొనుగోలు చేసిన భూమిపై వివాదం
దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 2.7 ఎకరాల భూమికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు వివాదాస్పద ఆస్తి విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని ఆదేశించింది.

జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించింది. అవసరమైతే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ పురోగతిని సమీక్షించేందుకు కేసు తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.

వివాదానికి కారణమైన ఈ భూమిని 1988 ఏప్రిల్ 19న శ్రీదేవి కుటుంబం కొనుగోలు చేసింది. అయితే, ఈ ఆస్తిలో తమకు వాటా ఉందని ఎంసీ శివకామి అనే మహిళ, ఆమె సోదరుడు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వీరి పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపించగా, బోనీకపూర్ కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన క్రయవిక్రయాలపై ఇప్పుడు దావా వేయడం కాలపరిమితి చట్టం ప్రకారం చెల్లదని సింఘ్వీ పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం, ప్రస్తుతానికి వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Sridevi
Boney Kapoor
Janhvi Kapoor
Supreme Court property dispute
Chennai land case

More Telugu News