జాతీయ గర్వం అహంకారంగా మారితే.. గెలుపుకు ప్రాధాన్యత ఉండదు: భారత్ ట్రోఫీ నిరాకరణపై మహమ్మద్ యూసఫ్

జాతీయ గర్వం అహంకారంగా మారితే.. గెలుపుకు ప్రాధాన్యత ఉండదు: భారత్ ట్రోఫీ నిరాకరణపై మహమ్మద్ యూసఫ్

Mohammad Yousuf slams India for refusing Asia Cup trophy from Mohsin Naqvi
  • ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు
  • నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరించిన టీమ్
  • వినయం లేని దేశం గెలిచినా ఓడిపోయినట్టే అన్న యూసఫ్

ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించడం తీవ్ర దుమారం రేపుతోంది. గత ఏడాది పురుషుల ఆసియా కప్ సమయంలోనూ భారత పురుషుల జట్టు నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా భారత మహిళల జట్టు కూడా అదే బాటలో పయనించి నఖ్వీకి షాక్ ఇచ్చింది.


దుబాయ్‌లో జరిగిన ఫైనల్ పోరులో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి భారత మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదనే నిర్ణయం వెనుక బీసీసీఐ ముందస్తు వ్యూహం ఉంది.


ఈ ట్రోఫీ నిరాకరణ ఘటనపై పాకిస్థాన్ మాజీ దిగ్గజ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించాడు. "జాతీయ గర్వం కాస్తా అహంకారంగా మారినప్పుడు, గెలుపునకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. జట్టు గెలవవచ్చు, కానీ వినయం లేని దేశం ఓడిపోయినట్టే" అని ట్వీట్ చేశాడు.


మోహ్సిన్ నఖ్వీని ప్రశంసిస్తూ యూసఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ట్రోఫీ తీసుకోకపోవడంపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పందిస్తూ ఇది బోర్డు తీసుకున్న సంస్థాగత నిర్ణయమని స్పష్టం చేశారు. వేడుకల్లో పాల్గొనకూడదనే విషయాన్ని ఏసీసీకి ముందే అధికారికంగా తెలియజేశామని ఆయన వెల్లడించారు. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతల దృష్ట్యా దేశప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఆటగాళ్లకు లేదా క్రీడకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోని వ్యూహాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
Advertisement
Mohammad Yousuf
Indian Women Cricket Team
Asia Cup 2026
Mohsin Naqvi
BCCI
India Pakistan Cricket News

More Telugu News