తిరుమలలో హైటెక్ ఆధ్యాత్మికత.. మ్యూజియం, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

తిరుమలలో హైటెక్ ఆధ్యాత్మికత.. మ్యూజియం, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu inaugurates High Tech SV Museum and Pilgrims Experience Center in Tirumala
  • తిరుమలను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నమూనాగా తీర్చిదిద్దుతామన్న సీఎం
  • రూ.104 కోట్లతో ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియం ప్రారంభం
  • భక్తుల సౌకర్యార్థం 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి
  • తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి రూ.2 లక్షల బీమా సౌకర్యం
  • రాష్ట్రవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యం
తిరుమలను ప్రపంచస్థాయి పవిత్ర దివ్యక్షేత్రంగా, ఆధ్యాత్మికతకు ఓ గొప్ప నమూనాగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను ఆధ్యాత్మికతతో సమన్వయం చేస్తూ భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా, బుధవారం తిరుమలలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రూ.104 కోట్ల భారీ వ్యయంతో టీసీఎస్ ట్రస్ట్ ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియంతో పాటు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద ఏర్పాటు చేసిన 'పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌'ను ఆయన భక్తులకు అంకితం చేశారు.

భక్తులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలతో పాటు తిరుమల క్షేత్రంలోని వివిధ ప్రాంతాలను 3డీ సాంకేతికత ద్వారా కళ్లారా వీక్షించే అవకాశం కల్పించారు. 6డీవీఆర్ వర్చువల్ రియాలిటీ ద్వారా శ్రీవారి దర్శన అనుభూతిని ముఖ్యమంత్రి స్వయంగా స్వీకరించి, ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం, ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని సీఎం ప్రారంభించారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీనివాసుని కల్యాణ ఘట్టం వంటి విశేషాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా ఇందులో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు వంటి మహారాజులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల 3డీ నమూనాలు, చారిత్రక వస్తువులు, స్వామివారి కిరీటాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పానోరమిక్ స్క్రీన్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన శ్రీవారి పరిణయ వీడియోను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. ఆనాటి సంగీత విద్వాంసులు వాడిన వాయిద్య పరికరాలను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎల్ఐసీ భాగస్వామ్యంతో ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. దీని ద్వారా తిరుమలలో దురదృష్టవశాత్తూ భక్తుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, మారిషస్, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి కూడా ఆలయ నిర్మాణానికి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు.

అనంతరం, తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రిలయన్స్ ఫౌండేషన్, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, దాతల ప్రతినిధులు సుచిత్రా ఎల్లా, నితిన్ సేత్‌లతో కలిసి ఆయన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే కొండపై 89.5 శాతం పచ్చదనం ఉందని గుర్తుచేశారు. ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, సేవ, ఆధునిక సాంకేతికత వంటి ఆరు కీలక అంశాల ప్రాతిపదికన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
Advertisement
Chandrababu Naidu
Tirumala Tirupati
SV Museum
High Tech Spirituality
Tirumala Electric Buses
Devotee Insurance Scheme

More Telugu News