మక్కాపై డ్రోన్ దాడి యత్నం.. స్పందించిన భారత్

మక్కాపై డ్రోన్ దాడి యత్నం.. స్పందించిన భారత్

Drone attack attempt on Mecca India responds
  • మక్కా సమీపంలో డ్రోన్ దాడి యత్నంపై భారత్ ఆందోళన
  • దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన సౌదీ అరేబియా
  • ఇది ఉగ్రచర్యేనని, రెచ్చగొట్టే ప్రయత్నమని సౌదీ ప్రకటన
  • సౌదీ సార్వభౌమాధికారంపై దాడులను ఖండించిన భారత్
సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో చోటుచేసుకున్న డ్రోన్ దాడి యత్నాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియా రక్షణ దళాలు ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలు ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ సందర్భంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు మక్కా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించడం అత్యంత ఆందోళనకరమైన విషయం" అని వ్యాఖ్యానించారు.

సౌదీ అరేబియా సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా సాగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం త్వరితగతిన నెలకొనాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్‌ను సౌదీ వైమానిక దళాలు ప్రాథమిక దశలోనే గుర్తించాయి. మక్కా నగరంలోని నిషిద్ధ గగనతలంలోకి అది ప్రవేశించకముందే గాలిలోనే అడ్డగించి ధ్వంసం చేశాయి.

ఈ హేయమైన చర్యను సౌదీ సంకీర్ణ దళాల ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్ మల్కి తీవ్రంగా పరిగణిస్తూ, ఇదొక ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఉమ్రా యాత్రికులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ముస్లింల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

రెండు పవిత్ర మసీదుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, దీనికి విఘాతం కలిగించే హౌతీలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 2017లో బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసిన తర్వాత, మక్కాను లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండోసారి అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Advertisement
Mecca
Saudi Arabia
India MEA
Randhir Jaiswal
Houthi rebels
Drone attack

More Telugu News