యూపీఐ లావాదేవీలు కస్టమర్లకు ఉచితమే.. కొత్త ఎండీఆర్‌ విధానంపై ఫోన్‌పే సీఈఓ క్లారిటీ

యూపీఐ లావాదేవీలు కస్టమర్లకు ఉచితమే.. కొత్త ఎండీఆర్‌ విధానంపై ఫోన్‌పే సీఈఓ క్లారిటీ

UPI transactions are free for customers PhonePe CEO clarifies on new MDR policy
  • యూపీఐ కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవన్న ఫోన్‌పే సీఈఓ
  • రూ.లక్షలోపు వార్షిక టర్నోవర్‌ వ్యాపారులకు ఎండీఆర్‌ వర్తించదని స్పష్టీకరణ
  • రూ.2 వేలలోపు లావాదేవీలపై ఛార్జీ ఉండదన్న నిగమ్‌
  • రూ.2 వేలకుపైగా లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వ్యాపారులే చెల్లిస్తారని వివరణ
  • ఎండీఆర్‌ ఆదాయం యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఉపయోగపడుతుందని ప్రస్తావన
యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్‌ స్పష్టం చేశారు. యూపీఐ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను ఆర్థికంగా నిలకడగా కొనసాగించేందుకు కొత్త మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) విధానం అవసరమని చెప్పారు. ఈ విధానం వల్ల కస్టమర్లపై అదనపు భారం పడదన్నారు.

ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీర్‌ నిగమ్‌ ఈ వివరాలు వెల్లడించారు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే చెల్లింపులతో పాటు వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే చెల్లింపులు కూడా వినియోగదారులకు ఉచితంగానే ఉంటాయని చెప్పారు. ఎండీఆర్‌ చెల్లించే వ్యాపారులు ఆ మొత్తాన్ని కస్టమర్లపై వేయడానికి అనుమతి ఉండదన్నారు.

వార్షిక టర్నోవర్‌ రూ.లక్ష కంటే తక్కువగా ఉన్న చిన్న వ్యాపారులు ఎండీఆర్‌ పరిధిలోకి రారని నిగమ్‌ తెలిపారు. పెద్ద దుకాణాల్లో జరిగే లావాదేవీల్లో 96 శాతం రూ.2 వేల కంటే తక్కువ మొత్తానివేనని చెప్పారు. వీటిపై ఎలాంటి ఛార్జీ ఉండదన్నారు. రూ.2 వేలకుపైగా జరిగే లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ను వ్యాపారులే చెల్లిస్తారని వివరించారు.

ఈ ఎండీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని యూపీఐ వ్యవస్థలో పెట్టుబడులకు ఉపయోగించవచ్చని నిగమ్‌ తెలిపారు. యూపీఐ మౌలిక సదుపాయాలను కొనసాగించేందుకే పరిశ్రమకు ఏటా కనీసం రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతోందన్నారు. కేవైసీ, సైబర్‌ భద్రత, మోసాల నివారణ, చార్జ్‌బ్యాక్‌లు, మూలధన వ్యయం వంటి వాటికీ భారీగా ఖర్చవుతుందని చెప్పారు.

యూపీఐ కొత్త ఆదాయ విధానం వల్ల ఫిన్‌టెక్‌ సంస్థలు మార్కెటింగ్‌, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిపై మరింత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందని నిగమ్‌ పేర్కొన్నారు. 2020 నాటికి యూపీఐ వినియోగదారులు దాదాపు 20 కోట్ల మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 50-55 కోట్లకు చేరిందని తెలిపారు.
Advertisement
Sameer Nigam
PhonePe
UPI MDR charges
UPI free transactions
Digital payments India
Fintech industry news

More Telugu News