వందే భారత్ గూడ్స్ రైలును చూశారా.. ఇదిగో వీడియో!

వందే భారత్ గూడ్స్ రైలును చూశారా.. ఇదిగో వీడియో!

Have you seen the Vande Bharat Goods Train here is the video
  • అహ్మదాబాద్-ముంబై మధ్య వందే భారత్ గూడ్స్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం
  • సరకు రవాణాను వేగవంతం చేయడమే భారత రైల్వే లక్ష్యం
  • పరీక్షల్లో భాగంగా గంటకు 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న రైలు
  • చెన్నై ఐసీఎఫ్ అభివృద్ధి చేసిన ఈ రైలులో అత్యాధునిక వ్యవస్థలు
  • ఈ ట్రయల్ రన్ వీడియోను పంచుకున్న ఏపీ బీజేపీ
భారతీయ రైల్వే మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వందే భారత్ గూడ్స్ రైలు (16 కోచ్‌ల ఫ్రైట్ ఈఎంయూ) కీలకమైన అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ మార్గంలో తన ట్రయల్ రన్‌ను ప్రారంభించింది. పశ్చిమ మధ్య రైల్వేలో తొలి దశ పరీక్షలు విజయవంతంగా ముగిసిన అనంతరం, ఇప్పుడు పశ్చిమ రైల్వే పరిధిలో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. దేశంలో సరకు రవాణాను వేగవంతం చేసే దిశగా ఇది ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.

ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై సెంట్రల్ మధ్య ఈ గూడ్స్ రైలు ట్రయల్ రన్ కొనసాగుతోందని, వివిధ వేగాల వద్ద రైలు పనితీరు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నామని అహ్మదాబాద్ డివిజన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైలును రూపొందించింది. వందే భారత్ ప్యాసింజర్ రైళ్ల టెక్నాలజీ ఆధారంగా, పార్శిళ్లు, ఇతర సరకులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ వందే భారత్ గూడ్స్ రైలులో అత్యాధునిక ప్రొపల్షన్, బ్రేకింగ్ వ్యవస్థలు, పార్శిళ్లను సులువుగా ఎక్కించి, దించేందుకు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, ప్రత్యేక రోలర్ ఫ్లోర్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. పండ్లు, కూరగాయలు వంటివి పాడవకుండా ఉండేందుకు ఉష్ణోగ్రత నియంత్రిత (రీఫర్) కంటైనర్ల సౌకర్యం కూడా కల్పించారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థలను అమర్చారు.

ఇప్పటికే పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని చౌమహ్లా-శ్యామ్‌గఢ్-గుర్లా, నాగ్‌దా-కోటా-సవాయ్ మాధోపూర్ సెక్షన్లలో నిర్వహించిన పరీక్షల్లో ఈ రైలు సత్తా చాటింది. ఖాళీ బోగీలతో ఉన్నప్పుడు గంటకు 145 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్డీఎస్ఓ, ఐసీఎఫ్ బృందాల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ బ్రేకింగ్, రైలు స్థిరత్వం వంటి అంశాలను పరీక్షించారు. ఈ పరిణామం దేశీయ సరుకు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఈ ట్రయల్ రన్‌కు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. 
Advertisement
Vande Bharat Goods Train
Indian Railways
Ahmedabad Mumbai trial run
Freight EMU
Integral Coach Factory Chennai
High speed freight train

More Telugu News