మేజర్ లీగ్ సాకర్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. నాష్‌విల్లే ఎస్సీతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ బాక్స్ బయటి నుంచి అద్భుతమైన గోల్ కొట్టి తన జట్టు ఇంటర్ మయామిని ఆధిక్యంలో నిలిపాడు. అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో మయామికి విజయం దక్కలేదు. ఆఖరి నిమిషంలో నాష్‌విల్లే గోల్ చేయడంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.

నిన్న‌ జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలోనే నాష్‌విల్లే దూకుడు కనబరిచింది. ఆట మొదలైన నాలుగో నిమిషంలోనే సామ్ సరిడ్జ్ గోల్ చేసి నాష్‌విల్లేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, ఇంటర్ మయామి వెంటనే తేరుకుంది. 19వ నిమిషంలో మెస్సీ కొట్టిన కార్నర్ కిక్‌ను అడ్డుకోబోయిన నాష్‌విల్లే డిఫెండర్ రీడ్ బేకర్-వైటింగ్, పొరపాటున బంతిని తమ సొంత గోల్ పోస్టులోకి పంపడంతో స్కోరు 1-1తో సమమైంది.

రెండో అర్ధభాగంలో మెస్సీ తన మార్క్ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించాడు. 62వ నిమిషంలో సహచర ఆటగాడు రోడ్రిగో డి పాల్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ, పెనాల్టీ ఏరియా బయటి నుంచి తన ఎడమ కాలితో కొట్టిన అద్భుతమైన షాట్ నేరుగా గోల్ నెట్‌లోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో ఇంటర్ మయామి 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో మెస్సీకి ఇది 19వ గోల్ కాగా, టాప్ స్కోరర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 2023లో మయామి జట్టులో చేరినప్పటి నుంచి నాష్‌విల్లేపై ఆడిన 14 మ్యాచ్‌లలో మెస్సీకి ఇది 17వ గోల్ కావడం గమనార్హం.

మ్యాచ్ మయామి గెలుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో నాష్‌విల్లే అనూహ్యంగా పుంజుకుంది. ఇంజురీ టైమ్‌లో సామ్ సరిడ్జ్ మరోసారి గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. దీంతో గెలుపు అంచుల వరకు వచ్చి మయామి డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితంతో ఈస్టర్న్ కాన్ఫరెన్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న నాష్‌విల్లే కంటే ఇంటర్ మయామి 9 పాయింట్ల వెనుకంజలో నిలిచింది. రెగ్యులర్ సీజన్‌లో మయామికి ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.