ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది: భట్టి విక్రమార్క

ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka says government is focused on floating solar plants
  • రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న భట్టి
  • ప్లోటింగ్ సోలార్ ప్లాంట్ల కోసం శ్రీశైలం, సాగర్ తదితర రిజర్వాయర్లను పరిశీలిస్తున్నామని వెల్లడి
  • విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు చేరిందన్న డిప్యూటీ సీఎం

తెలంగాణలో పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ) రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, అందులో భాగంగా రిజర్వాయర్లపై ‘ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ల’ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నీటిపారుదల, విద్యుత్ శాఖలు సంయుక్తంగా నాగార్జునసాగర్, శ్రీశైలం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన రిజర్వాయర్లను దీనికోసం సమగ్రంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు.


ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధిక వ్యయం కావడం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు/సుంకాల వల్ల ఒక్క మెగావాట్ ప్రాజెక్టుపై దాదాపు రూ. 1.30 కోట్ల మేర అదనపు భారం పడుతోందని, ఈ నిబంధనలను కేంద్రం సడలిస్తే రాష్ట్రానికి సోలార్ విభాగంలో పెట్టుబడులు భారీగా వెల్లువెత్తుతాయని పేర్కొన్నారు.


రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం పెరగడంతో విద్యుత్ డిమాండ్ ఏకంగా 19,000 మెగావాట్లకు చేరిందని తెలిపారు. పేదలు, రైతుల విద్యుత్ సబ్సిడీల కోసం ప్రభుత్వం ఏటా రూ. 19,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని వివరించారు. 


గిరిజన ప్రాంతాల్లో ఉచిత సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు భట్టి ప్రకటించారు. అమ్రాబాద్ పరిధిలోని 80 గ్రామాలను పూర్తిస్థాయిలో సోలరైజ్ చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టామని, అక్కడ స్వతంత్ర 'మైక్రో గ్రిడ్లు' నిర్మించేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. సాధారణ రైతులు, ప్రజలు తమ ఇళ్లు, పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Bhatti Vikramarka
Telangana Floating Solar Plants
Renewable Energy Telangana
Nagarjuna Sagar Solar Project
Indira Soura Giri Jala Vikasam
Telangana Power Demand

More Telugu News