నారా లోకేశ్ అడ్డంగా దొరికిపోయారు: అంబటి రాంబాబు

నారా లోకేశ్ అడ్డంగా దొరికిపోయారు: అంబటి రాంబాబు

Nara Lokesh caught red handed says Ambati Rambabu
  • డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న అంబటి
  • చంద్రబాబు, లోకేశ్ మౌనంగా ఉన్నారని మండిపాటు
  • ఉద్యోగాలను లోకేశ్ బఠానీలు అమ్మినట్టు అమ్మేశారని విమర్శ

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని... విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఈ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం మౌనం వహిస్తోందని... లోకేశ్ కు మంత్రి పదవిలో కొనసాగే అర్హత, హక్కు రెండూ లేవని మండిపడ్డారు. ఈ మొత్తం నియామక అక్రమాలపై తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.


డీఎస్సీపై ప్రతిపక్షాలు, అభ్యర్థులు ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ ఏమీ మాట్లాడకుండా మత్తు ఇంజక్షన్లు తీసుకున్నట్లు మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఐఏఎస్ అధికారులను ముందరకు నెట్టి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.


"నారా లోకేశ్ ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు మార్కెట్లో అమ్మేశారు. ఆయన దొరికిపోయిన దొంగ. రాజకీయాలకు, మంత్రి పదవికి ఎంతమాత్రం పనికిరారు" అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. లోకేశ్ ను భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని, ఒకవేళ ఆయనకు ఆ పదవి ఇస్తే ఏకంగా రాష్ట్రంతో పాటు దేశాన్నే అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. లోకేశ్ వైఖరి వల్లే టీడీపీ సర్వనాశనం కాబోతోందని వ్యాఖ్యానించారు.


ఇప్పటికే జరిగిన డీఎస్సీలోనే వందలాది పోస్టులు అక్రమాలకు గురయ్యాయని, మళ్లీ మరో రెండు డీఎస్సీలు నిర్వహిస్తామని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకున్న లోకేశ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు.

Advertisement
Nara Lokesh
Ambati Rambabu
AP DSC Scam
APPSC Corruption Allegations
Andhra Pradesh Education Department
CBI Inquiry Demand

More Telugu News