90 ఎంఎల్ వేసుకుని ఆ ఫేక్ అకౌంట్ సృష్టించారా?: రేవంత్ రెడ్డిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
- 'సంధ్యా రావు' అనే ఫేక్ ఐడీని కాంగ్రెస్ సృష్టించిందన్న ప్రవీణ్ కుమార్
- ఈ డ్రామా వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపణ
- ఏ పార్టీకి అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవి ఉండదని వ్యాఖ్య
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘సంధ్యా రావు’ అనే ఎక్స్ ఐడీ చేసిన ట్వీట్ ను ప్రదర్శించడంపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఒక నకిలీ ఖాతా ఆధారంగా సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అసలు ఏ రాజకీయ పార్టీకైనా ‘అంతర్జాతీయ కార్యదర్శి’ అనే పదవి ఉంటుందా అని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి కూడా అంతర్జాతీయ కార్యదర్శి అనే పదవి ఉండదని... సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ ఏ పార్టీ చూసుకున్నా ఇలాంటి హోదా ఉండదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అలాంటిది ‘సంధ్యా రావు’ అనే పేరుతో బీఆర్‌ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి అని రేవంత్ రెడ్డే కొత్త పదవిని సృష్టించారని దుయ్యబట్టారు.
ఫేక్ ఐడీ పోస్టులను సృష్టించేటప్పుడు కాంగ్రెస్ నేతలు లేదా సీఎం ఏమైనా '90ఎంఎల్' వేసుకుని ఉన్నారా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ డ్రామా వెనుక ఉన్న అసలు సూత్రధారి రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. కాంగ్రెస్ ఐటీ సెల్ ద్వారానే 'సంధ్యా రావు' అనే ఫేక్ ఐడీని సృష్టించి, దాంతో తప్పుడు పోస్టులు పెట్టించి, ఆపై అదే అంశంపై రేవంత్ రెడ్డే స్వయంగా సిట్ విచారణకు ఆదేశించడం విచిత్రంగా ఉందని ధ్వజమెత్తారు.