ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ

Good news for employees CM Revanth key assurance on DAs
  • ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు
  • ఆరు డీఏలు త్వరలో ప్రకటిస్తామని సీఎం హామీ
  • పీఆర్‌సీ నివేదికను వెంటనే అందేలా చర్యలు
  • ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తెలియజేసిన నేతలు
  • ఉద్యోగుల పక్షాన ఉంటానని సీఎం హామీ
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ ఆహ్వానం మేరకు సీఎంను కలిసి తమ సమస్యలను వివరించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వివరించారు.

పీఆర్‌సీ కమిటీ నివేదిక ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను కూడా జేఏసీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాల నాయకులపై పెరుగుతున్న ఒత్తిడి గురించి కూడా వివరించారు. సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. తాను ఎప్పుడూ ఉద్యోగుల పక్షానే ఉంటానని హామీ ఇచ్చినట్లు ‘తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌’ (టీఆర్‌ఈఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె. గౌతమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమణ్ రెడ్డి తెలిపారు.

ఆరు డీఏలపై త్వరలోనే ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు వెల్లడించారు. పీఆర్‌సీ కమిటీ నివేదిక కూడా వెంటనే తనకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సీఎం సానుకూలంగా స్పందించి హామీలు ఇవ్వడంపై టీఆర్‌ఈఎస్‌ఏ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని నేతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీఆర్‌ఈఎస్‌ఏ గౌరవాధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ఉన్నారు.
Advertisement
Revanth Reddy
Telangana DA Hike
Telangana Government Employees
PRC Committee Report
Telangana Dearness Allowance
TRESA

More Telugu News