ఏపీలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

Andhra Pradesh Orange Alert for 8 districts rains with lightning expected
  • ఏపీలోని 8 జిల్లాలకు రాగల 3 గంటలకు ఆరెంజ్ అలెర్ట్
  • విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం
  • పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
  • చెట్ల కింద, హోర్డింగుల వద్ద ఉండవద్దని ప్రజలకు సూచన
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది.

ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేసింది. వర్షం పడుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, కూలిపోయే ప్రమాదం ఉన్న పాత గోడల వద్ద, పెద్ద హోర్డింగుల కింద నిలబడరాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆకస్మిక వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సహాయక చర్యల కోసం అధికారులను సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Andhra Pradesh
Orange Alert
Thunderstorms
Heavy Rains
Weather Update
APSDMA

More Telugu News