చంద్రబాబు అపర భగీరథుడు: పోలవరం జలాలకు పూజలు చేసి, జగన్‌పై విరుచుకుపడ్డ వర్మ

Chandrababu Naidu is Apara Bhagiratha says Varma after Polavaram water rituals and slamming Jagan
  • కత్తిపూడి సమీపంలో పోలవరం కాలువ జలాలకు పూజ చేసిన వర్మ
  • పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టినప్పుడు జగన్ వెకిలి నవ్వులు నవ్వారని మండిపాటు
  • వైసీపీ హయాంలో పురుషోత్తపట్నం పనులను పక్కన పెట్టారని విమర్శ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అపర భగీరథుడిగా అభివర్ణించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం జలాలను మళ్లించి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చంద్రబాబు సస్యశ్యామలం చేశారని ప్రశంసించారు. కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలో పోలవరం ఎడమ కాలువ జలాలకు ఈరోజు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ... చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలోనే పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఆలోచన రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. ఆ తర్వాత రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారని, పిఠాపురంలోనే దీనికి శంకుస్థాపన జరిగిందని వివరించారు. ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి, నిలిపివేయడానికి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకంగా కేంద్రానికి లేఖలు రాశారని మండిపడ్డారు. 


గతంలో పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టినప్పుడు జగన్ మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వారని, సుజల స్రవంతి ప్రాజెక్టును సైతం అడ్డుకుని ఉత్తరాంధ్రకు తీవ్ర ద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అసూయతోనే పురుషోత్తపట్నం పనులను వైసీపీ హయాంలో పక్కనబెట్టారని విమర్శించారు.


పురుషోత్తపట్నం ప్రాజెక్టు వల్ల ఏలేరు ఆయకట్టు పరిధిలోని ఐదు నియోజకవర్గాల రైతులకు నిరంతర సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా సుమారు లక్ష ఎకరాల్లో రెండు పంటలకు అవసరమైన నీరు సమకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పురుషోత్తపట్నం నుంచి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా 3,400 క్యూసెక్కుల నీరు అనకాపల్లికి చేరుకుందని, గ్రావిటీ ద్వారా తుని ప్రాంతానికి కూడా సాగునీరు సమృద్ధిగా వెళ్తోందని తెలిపారు.

Advertisement
Chandrababu Naidu
Purushothapatnam Lift Irrigation Scheme
SVSN Varma
Polavaram Project
Andhra Pradesh Water Resources
Jagan Mohan Reddy

More Telugu News