వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ప్రజా రంజకం.. ఆర్థిక లోటు ఉన్నా సంక్షేమం ఆపలేదు: పొంగులేటి
- వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- సామాన్యుల కష్టాలు తీర్చేందుకు నిరంతరం కృషి చేశామన్న పొంగులేటి
- రైతు సంక్షేమానికి రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... తమ ప్రజా పాలనలో సామాన్యుల కష్టాలను తీర్చడానికే నిరంతరం కృషి చేశామని అన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం, గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ ‘వరి వేస్తే ఉరే’ అన్నారని, కానీ తమ ప్రభుత్వం రాగానే వరి సాగుకు మద్దతుగా రూ.500 బోనస్ అందిస్తూ, వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపామని గుర్తుచేశారు. రైతు సంక్షేమానికై ఇప్పటికే రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.8.21 లక్షల కోట్లకు పైగా అప్పులు, నిలిచిపోయిన బకాయిలు, సర్పంచ్‌ల బకాయిలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులను కూడా తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిందని తెలిపారు. అతి త్వరలోనే మరో 3 లక్షల మందికి కొత్తగా వితంతు, వృద్ధాప్య పింఛన్లు అందజేయబోతున్నామని ప్రకటించారు.
కేటీఆర్ హద్దులు మీరి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు ధరణి పేరుతో కొల్లగొట్టిన భూములు, ఆస్తులపై విచారణ జరుగుతోందని, 22ఏ భూములపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిజమైన ప్రతిపక్ష హోదాకు కేసీఆర్ పూర్తిగా అనర్హుడని విమర్శించారు.