కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కొత్తేమీ కావు.. హద్దులు దాటితే అధిష్ఠానం చూసుకుంటుంది: రేవూరి ప్రకాశ్ రెడ్డి
- పార్టీలో అభిప్రాయభేదాలు సహజమేనన్న రేవూరి
- నేతల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్న కడియం కావ్య
కాంగ్రెస్ అనేది ఒక విలక్షణమైన జాతీయ పార్టీ అని, పార్టీలో అభిప్రాయభేదాలు, అంతర్గత కొట్లాటలు ఉండటం సహజమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరి మధ్య విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని అన్నారు. చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని, అయితే ఆ చర్చలు లేదా వివాదాలు పరిమితులు దాటితే మాత్రం పార్టీ అధిష్ఠానం కచ్చితంగా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇళ్లను కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితం చేయకుండా, అర్హులైన నిరుపేదలందరికీ పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన అందించారంటూ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్‌లతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.