ఇది భిక్ష కాదు: భారత్, చైనా, అమెరికా నుంచి నష్టపరిహారం కోరిన నేపాల్ మంత్రి
- నేపాల్ ఆకస్మిక వరదల వల్ల ఇప్పటి వరకు 11 వందల మందికి పైగా మృతి
- పారిశ్రామిక దేశాలు విడుదల చేసే ఉద్గారాల వల్ల తాము మూల్యం చెల్లించుకుంటున్నామన్న నేపాల్
- తమకు నష్టపరిహారం చెల్లించడం చట్టపరమైన బాధ్యత అని వ్యాఖ్య
నేపాల్‌ను ముంచెత్తిన ఘోర జలప్రళయం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన వేళ, ఆ దేశ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై కీలక విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న భారత్, చైనా, అమెరికా దేశాల నుంచి 'వాతావరణ మార్పుల నష్టపరిహారం' కోరుతూ నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ సంచలన ప్రకటన చేశారు.
భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటికే 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఈ తీవ్ర విపత్తు వాతావరణ మార్పుల వల్ల హిమనీనదాలు (గ్లేసియర్లు) విరుచుకుపడటం వల్లే సంభవించిందని శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు తమ దేశం కారణం కాకపోయినా, అతిపెద్ద పారిశ్రామిక దేశాలు విడుదల చేసే ఉద్గారాల వల్ల తాము తీవ్ర మూల్యం చెల్లించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమకు ఇచ్చే సాయం లేదా భిక్ష కాదని, బాధితులకు చెల్లించాల్సిన చట్టపరమైన, నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు.
తమ దౌత్య విధానాన్ని ‘సాయం కోరడం’ నుంచి ‘న్యాయం, నష్టపరిహారం పొందే’ దిశగా మారుస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు... రానున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, పునర్నిర్మాణానికి ప్రాథమికంగా 4 నుంచి 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.