ఏపీకి మరో 13 నవోదయలు, రెండో ఎయిమ్స్ ఇవ్వండి: నిర్మలా సీతారామన్‌కు ఎంపీ లింగమనేని విజ్ఞప్తి
- నిర్మలా సీతారామన్‌ను కలిసిన లింగమనేని రమేశ్
- ఏపీలో కేవలం 15 జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయన్న ఎంపీ
- కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, వైద్య విద్యా విస్తరణను ఆకాంక్షిస్తూ జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్తగా మరో 13 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు, రెండో 'ఎయిమ్స్' (AIIMS) మంజూరుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆమెను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
అనంతరం లింగమనేని మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం 28 జిల్లాలు ఉండగా కేవలం 15 జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. గతంలో కేంద్ర మంత్రివర్గం ఐదేళ్ల కాలానికి రూ. 2,359.82 కోట్లతో దేశవ్యాప్తంగా 28 నవోదయల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రాతిపదికన, ఏపీలోని మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు దాదాపు రూ. 1,096 కోట్ల మేర నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్రంలో రెండో ఎయిమ్స్ ఏర్పాటు అత్యంత అవసరమని పేర్కొన్నారు. 2014 విభజన తర్వాత మంగళగిరిలో ఒక ఎయిమ్స్ ఏర్పాటైనప్పటికీ, విస్తృతమైన రీతిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధనలను విస్తరించేందుకు ప్రాథమిక బడ్జెట్ కేటాయింపులతో డీపీఆర్ తయారు చేసి రెండో ఎయిమ్స్ నిర్మాణానికి మూలధన నిధులు ఇవ్వాలని కోరారు. ఈ నిర్ణయాలు 'వికసిత్ భారత్ @2047', జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.