Advertisement

రోజుకు 5 నిమిషాలు.. నెలకు రూ.8 లక్షలు! ఆ కుర్రాడి ఆలోచన ఇప్పుడు రూ.5 లక్షల కోట్ల సామ్రాజ్యం

Masayoshi Son five minutes a day idea built a five lakh crore empire
  • కాలేజీ రోజుల్లో రోజుకు 5 నిమిషాలతో ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న సన్‌
  • ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌లేటర్‌ను షార్ప్‌కు 1.7 మిలియన్‌ డాలర్లకు విక్రయం
  • 18 నెలల్లో వివిధ వ్యాపారాలతో 3.2 మిలియన్‌ డాలర్ల సంపాదన
  • 1981లో సాఫ్ట్‌బ్యాంక్‌ను స్థాపించిన మసయోషి సన్‌
  • 2000లో అలీబాబాలో 20 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి
రోజుకు ఐదు నిమిషాలు.. అంతే పని. కానీ నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి! ఈ మాట వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కాలేజీ రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఓ యువకుడు. స్నేహితులు కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐదు నిమిషాల పని అంటే ఐదు నిమిషాలే.. ఆ సమయంలో ఏం ఆలోచించాలో నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన ఓ చిన్న పరికరానికి దారి తీసింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.

ఆ యువకుడే మసయోషి సన్‌. నేడు సాఫ్ట్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడిగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. 2026 సెప్టెంబరు 1 నాటికి ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం ఆయన సంపద 63.2 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.3 లక్షల కోట్లు. కానీ ఈ స్థాయికి ఆయన ప్రయాణం మాత్రం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్‌లీలో ఓ విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలైంది.

ఐదు నిమిషాల ఆలోచన..
1970ల చివర్లో బెర్క్‌లీలో ఆర్థికశాస్త్రం చదువుతున్న సన్‌ తనకు తానే ఓ సవాల్‌ విసిరుకున్నారు. రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఓ వినూత్న ఆదాయ మార్గం కోసం ఆలోచించారు.

ఆ ఐదు నిమిషాల్లో ఓ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌లేటర్‌ ఆలోచన వచ్చింది. బెర్క్‌లీలోని పరిశోధకులు, ప్రొఫెసర్‌ ఫారెస్ట్‌ మోజర్‌ సహకారంతో దాన్ని అభివృద్ధి చేశారు. చివరకు ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ సంస్థ షార్ప్‌కు 1.7 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు.

అక్కడితో ఆగలేదు. ఉపయోగించిన వీడియో గేమ్‌ యంత్రాలను జపాన్‌ నుంచి అమెరికాకు తీసుకొచ్చి డార్మిటరీలు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసే మరో వ్యాపారం ద్వారా సుమారు 1.5 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. కేవలం 18 నెలల్లో మొత్తం 3.2 మిలియన్‌ డాలర్లు. ఐదు నిమిషాల ఆలోచనకు ఇది తొలి ఫలితం.

ఓ సలహా మార్చిన జీవితం
1957 ఆగస్టు 11న జపాన్‌లోని సాగ ప్రిఫెక్చర్‌లో మసయోషి సన్‌ జన్మించారు. కొరియన్‌ మూలాలున్న కుటుంబంలో పెరిగారు. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన నేపథ్యం కారణంగా వివక్షను కూడా ఎదుర్కొన్నట్లు ఆయన గతంలో చెప్పారు.

యువకుడిగా అమెరికాకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. జపాన్‌లోనే ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌ను జపాన్‌కు తీసుకొచ్చిన వ్యాపారవేత్త డెన్‌ ఫుజిటాను కలిశారు. ఇంగ్లిష్‌ నేర్చుకో, కంప్యూటర్లను అభ్యసించు, అమెరికా వెళ్లు.. అని ఆయన ఇచ్చిన సలహా సన్‌ జీవితానికి దిశ చూపింది.

అమెరికాకు వెళ్లిన సన్‌ బెర్క్‌లీ చేరి ఆర్థికశాస్త్రం చదివారు. అదే సమయంలో కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. 1980లో చదువు పూర్తి చేశారు. మరుసటి ఏడాదే సాఫ్ట్‌వేర్‌ పంపిణీ సంస్థగా సాఫ్ట్‌బ్యాంక్‌ను ప్రారంభించారు.

అలీబాబాపై 2 కోట్ల డాలర్ల పందెం
సన్‌కు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం ఆయన పెట్టుబడులే. 1990లలో ఇంటర్నెట్‌ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఆ రంగంలోని కంపెనీలపై ఆయన దృష్టి పెట్టారు. యాహూ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు.

2000లో చైనాకు చెందిన యువ వ్యాపారవేత్త జాక్‌ మా ఆయన్ను కలిశారు. అప్పటికీ అలీబాబా ఓ చిన్న ఇంటర్నెట్‌ సంస్థ. అయినా సన్‌ దానిలో 20 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టారు. తర్వాత అలీబాబా భారీ టెక్‌ దిగ్గజంగా ఎదగడంతో ఆ పెట్టుబడి విలువ బిలియన్ల డాలర్లకు చేరింది. టెక్నాలజీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడుల్లో అదొకటిగా నిలిచింది.

రూ.8 లక్షల కోట్ల టెక్‌ ఫండ్‌!
2016లో సన్‌ మరో భారీ అడుగు వేశారు. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ను ప్రకటించారు. లక్ష్యం ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు. రవాణా, ఈ-కామర్స్‌, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్‌ తదితర రంగాల్లో దూసుకెళుతున్న స్టార్టప్‌లలో భారీ పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్‌ లక్ష్యం.

కొన్ని విజయాలు సన్‌ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగించాయి. అయితే అదే దూకుడు కొన్ని భారీ నష్టాలను కూడా తెచ్చింది.

ఒక్క తప్పు.. వేల కోట్ల నష్టం
వర్క్‌షేర్‌ సంస్థగా మొదలై ఆఫీస్‌ స్పేస్‌ రంగంలో సంచలనంగా ఎదిగిన వీ‌వర్క్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ భారీగా పెట్టుబడి పెట్టింది. 2019లో వీవర్క్‌ ఐపీఓ ప్రయత్నం విఫలమవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టం వచ్చింది. 2020 నాటికి వీ‌వర్క్‌పై సాఫ్ట్‌బ్యాంక్‌ మొత్తం అప్పులు 14.25 బిలియన్‌ డాలర్లకు పైగా చేరాయి.

సన్‌ పెట్టుబడి తత్వానికి వీ‌వర్క్‌ ఓ పెద్ద పాఠంగా మారింది. భారీ లాభాలు రావాలంటే భారీ రిస్క్‌ కూడా తీసుకోవాల్సిందే. అదే సమయంలో తప్పు అంచనాల ధర కూడా అంతే భారీగా ఉంటుంది.

ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై
వీటన్నింటి తర్వాత సన్‌ చూపు ఇప్పుడు కృత్రిమ మేధ వైపు మళ్లింది. ఆయన దృష్టిలో ఇది సాధారణ ఏఐ దశ కాదు. ‘ఆర్టిఫిషియల్‌ సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ యుగానికి ప్రపంచం వెళుతోందని ఆయన భావిస్తున్నారు.

2026 మార్చి 31 నాటికి సాఫ్ట్‌బ్యాంక్‌ ఓపెన్‌ఏఐలో 34.6 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది. ఏఐ మోడళ్లతో ఆగకుండా మౌలిక వసతులపైనా సన్‌ భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

2025 జనవరిలో సాఫ్ట్‌బ్యాంక్‌, ఓపెన్‌ఏఐ, ఒరాకిల్‌, ఎంజీఎక్స్‌ కలిసి ‘స్టార్‌గేట్‌’ ప్రాజెక్టును ప్రకటించాయి. అమెరికాలో ఏఐ మౌలిక వసతుల కోసం నాలుగేళ్లలో 500 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో సన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
Advertisement
Masayoshi Son
SoftBank
Alibaba
Vision Fund
Artificial Intelligence
Stargate Project

More Telugu News